చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా? | From Provocation to Blame Game, KSR Comments On Chandrababu Naidu Politics Behind Attacks On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?

Feb 5 2026 11:59 AM | Updated on Feb 5 2026 12:20 PM

KSR Comment: Chandrababu No Reaction On Ambati Row

మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్‌బుక్‌ అరాచకం సృష్టిస్తున్న  పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్‌లో పడవద్దని కేడర్‌కు చెబుతున్నారట. 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్‌లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్‌ కూడా కాలేదు. 

తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్‌, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. 

పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. 

అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. 

ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్‌ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్‌లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. 

అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. 

చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్‌లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్‌ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ను నిలదీశారు. 

ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్‌ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్‌ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? 

చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్‌లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు  చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు  పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement