వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court key comments on Viveka case | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Feb 5 2026 11:27 AM | Updated on Feb 5 2026 2:06 PM

Supreme Court key comments on Viveka case

ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే  దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను  సుప్రీంకోర్టులో  సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున  న్యాయవాది కోర్టుకు తెలిపారు.  ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు  కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.

విచారణలో భాగంగా జస్టిస్‌ సుందరేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్‌ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్‌ సుందరేష్‌ స్పష్టం చేశారు.

గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్‌ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు  పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా.. సునీత పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement