సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
ముందుగా వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు.
ఈ సభలో వైఎస్సార్‌సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్‌లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు.
వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్ఎంఎస్‌ఎస్‌కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్‌రెడ్డి హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.
శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి.



