విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

విధి

విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం

నంద్యాల: విధి నిర్వహణలో ఏఆర్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన ‘మొబిలైజేషన్‌’ ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయుధ బలగాలనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో, చట్ట పరిధిలో జరుగుతున్న మార్పులను గమనించాలన్నారు. శాంతిభద్రతలో కొత్తగా తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎస్కార్ట్‌, గార్డ్‌, పికెట్‌, బందోబస్తు విధులను, మాబ్‌ కంట్రోల్‌ను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున గుప్త, సూర్య మౌళి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్‌, సురేష్‌ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో తొలి మహిళా హెవీ వెహికల్‌ డ్రైవర్‌గా లక్ష్మిదేవి

నంద్యాల: జిల్లాలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మిదేవిని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అభినందించారు. బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఆమె సాధించిన విజయాన్ని కలెక్టర్‌ కొనియాడుతూ, ఇది జిల్లాలోని మహిళలకు గర్వకారణమన్నారు. సాధారణంగా ఆటో నడిపే స్థాయి నుంచి ప్రారంభించి.. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన లక్ష్మిదేవి లారీ, బస్సు వంటి భారీ వాహనాలను నడిపే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందారన్నారు. ఏ రంగమైనా మహిళలు ముందడుగు వేసినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. లక్ష్మిదేవి సాధించిన విజయం ఎంతోమంది మహిళలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

ఐదు ఆయుష్‌ కేంద్రాలకు భవనాలు మంజూరు

గోస్పాడు: జిల్లాలో ఐదు ఆయుష్‌ కేంద్రాలకు భవనాలు మంజూరైనట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇన్‌చార్జి ఈఈ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రం నంద్యాల, జిల్లెల్ల, శిరివెళ్ల, దొర్నిపాడు, పాణ్యంలోని ఆయుష్‌ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయన్నారు. నంద్యాలలో రూ.50 లక్షలతో, పాణ్యంలో రూ.30 లక్షలు, జిల్లెల్ల, శిరివెళ్ల, దొర్నిపాడులో ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలతో నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయని, మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

ప్రత్యేక అధికారిగా ఆజాద్‌

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు ఉత్సవాల ముఖ్య అధికారిగా ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు సిబ్బందిని నియమించారు. వసతి గది, అటెండర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీఆర్వోను ఆదేశించారు. అలాగే సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా ఆలయ ఏఈవోలు వెంకటేశ్వరరావు, హరిదాసు, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.శివప్రసాద్‌ను సీసీగా నియమిస్తూ దేవస్థాన ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులు

కర్నూలు: ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 6న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బందోబస్తుకు నాలుగు జిల్లాల పోలీసులను వినియోగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముగ్గురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు పాల్గొననున్నట్లు చెప్పారు.

విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం 1
1/1

విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement