ఊరించి.. ఉసూరుమనిపించి!
ఉచిత కుట్టు శిక్షణ పూర్తయినా మిషన్లు ఇవ్వని వైనం
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన మహిళలు
శిక్షణ కేంద్రాల నిర్వహకులకు సైతం అందని బిల్లులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న కుట్టు శిక్షణ పొందిన మహిళలు
ఆళ్లగడ్డ: స్వయం ఉపాధి పేరుతో మహిళలను ఊరించారు. ఉచితంగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేస్తామని ఆశపెట్టారు. పనులు మానుకుని ఎంతో మంది శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. శిక్షణ పూర్తయి ఏడు నెలలు గడిచినా మిషన్ల జాడ లేదు. కనీసం శిక్షణ సర్టిఫికెట్లు అందలేదు. ఆర్భాట ప్రచారం చేసి చివరకు చేతులెత్తేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమమే నిదర్శనమే. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమావేశాల్లో ఊదరగొట్టారు. ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాం. ఇందు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, ఈబీసీ, కాపు వర్గానికి చెందిన పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం. శిక్షణ తీసుకున్న మహిళలు ఉద్యోగాలు, బ్యాంకు రుణాలు పొందేలా సర్టిఫికెట్ కూడా ఇస్తాం’.. అంటూ నమ్మించి చివరకు మొహం చాటేశారు. గతేడాది ఏప్రిల్‌లో జిల్లాలో 23 కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయగా అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలో 3,024 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. 90 రోజులు శిక్షణ పొందిన మహిళలకు శిక్షణ అనంతరం బేసిక్ మోడల్ కుట్టుమిషన్ ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్ కూడా ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ ఆగస్టులో పూర్తయింది. అయితే శిక్షణ పూర్తయి 7 నెలలు కావస్తున్నా నేటికీ కుట్టు మిషన్లు అందించలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా శిక్షణ పొందిన మహిళలు తమకు కుట్టు మిషన్లు కాదు కదా కనీసం సర్టిఫికెట్లు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్‌ను కలిసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెల కావస్తున్నా ఎవరూ స్పందించడం లేదు.
నిర్వాహకులకు శఠగోపం
ఉచిత శిక్షణలో భాగంగా జిల్లాలో 23 కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒక టీచర్‌తో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా నియమించారు. టీచర్ కుట్టు, కటింగ్‌పై మెలకువలు ట్రైనింగ్ ఇవ్వడానికి, కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థుల హాజరు తదితర వివరాలు నమోదు చేసుకునేందుకు నియమించారు. అయితే ప్రభుత్వం టీచర్‌కు నెలకు రూ. 15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ. 12 వేలు చొప్పున ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వలేదు. అంతే కాకుండా మిషన్లు సమకూర్చి, గదులు బాడుగకు తీసుకుని శిక్షణ ఇచ్చిన కేంద్రాల నిర్వహకులు సైతం బిల్లుల కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం.
ఉచిత శిక్షణ, మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో బీసీ, ఈబీసీ మహిళలతో పాటు అన్ని వర్గాలకు చెందిన పేద, మద్యతరగతి మహిళలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాల్లో శిక్షణ తీసుకున్నారు. నిబంధనల మేరకు 360 గంటలు శిక్షణ తీసుకోవాలని నిర్ణయించడంతో రోజుకు నాలుగు గంటల చొప్పున 90 రోజులు శిక్షణ పొందారు. కుట్టు మిషన్ సర్టిఫికెట్‌తో ఉద్యోగ అవకాశం పొందవచ్చని, బ్యాంకులో రుణాలు పొందవచ్చని చెప్పడంతో మహిళ లు ఎంతో ఉత్సాహంగా సొంత ఖర్చులతో వ్యయ ప్రయాశాలకోర్చి శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే 7 నెలలు అయినా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందలేదు. శిక్షణ ఇచ్చిన శిబిరాల దగ్గరకు వెళితే అక్కడ ఎవరూ లేరు. దీంతో తమ పరిస్థితి ఎవరికి వివరించాలో కూడా అర్థంకాని అయోమయస్థితిలో ఉన్నారు.


