చంద్రబాబు ద్రోహంతో సీమ భవిష్యత్ ప్రశ్నార్థకం
వైఎస్సార్‌సీపీ హయాంలో ‘రాయలసీమ’ పనులు 70 శాతం పూర్తి
తెలంగాణకు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోం
మోటార్లు బిగిస్తే ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం
5న చలో పోతిరెడ్డిపాడు సభకు తరలిరండి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహంతో రాయలసీమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. సీమలో కరువును తరిమికొట్టేందుకు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రాయలసీమ ఎత్తిపోతల’ ప్రాజెక్ట్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈనెల 5వ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను మంగళవారం పాణ్యం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, పార్టీ నేతలతో కలసి కాటసాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగులు నీరు ఉండగానే తెలంగాణ ప్రభు త్వం ప్రాజెక్టులకు నీరు మళ్లించి వాడుకుంటుందన్నారు. అదే తరహాలోనే రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారన్నారు. దాదాపుగా రూ. 3వేల కోట్లకు పైగా వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుకు మో టార్లు అమర్చితే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని చెప్పినా ఇంత వరకు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. బాబు చేసిన ద్రోహం సీమ ప్రజలు గుర్తు పెట్టుకుని బుద్ధి చెబుతారన్నారు.
రాయలసీమ ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు
ఐదు ఉమ్మడి జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్ట్‌ను సాధించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీమ ప్రాజెక్ట్‌లకు ప్రాణం పోశారన్నారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే కారణంతోనే పనులు నిలిపేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ను సాధించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్‌రెడ్డి, రామలక్ష్మయ్య, సుబ్బరాయుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, రామచంద్రుడు, అశోక్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి, భాస్కర్, చంద్రశేఖర్‌రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజ యవంతం చేయాలన్నారు.
బహిరంగ సభకు తరలిరండి


