4 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతివ్వండి
ఫారెస్టు అధికారులను ఆదేశించిన కలెక్టర్
పులల గణనకు ఇబ్బందులు తలెత్తనీయొద్దు
ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి నల్లమల మీదుగా పాదయాత్రగా వెళ్లే భక్తులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శ్రీశైలం మహాక్షేత్రానికి గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో పాదయాత్ర భక్తులకు నల్లమల మీదుగా వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. భక్తులు కూడా అటవీశాఖ అధికారులకు సహ కరించాలన్నారు. ప్రస్తుతం పులుల గణన జరుగుతున్నందున ఇబ్బందులు తలెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అటవీ శాఖ అనుమతులతో వెంకటాపురం నుంచి దోర్నా ల రహదారి విస్తరణ చేపడుతామన్నారు. 3 కోట్లతో చేపట్టిన సిద్ధాపురం అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, మైనర్ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


