నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ | Bigg Boss Thanuja Puttaswamy Angry about Trolls | Sakshi
Sakshi News home page

Thanuja: చిత్రవధ చేస్తున్నారు.. ఎందుకింత విషం? నన్ను బతకనివ్వండి

Feb 2 2026 12:14 PM | Updated on Feb 2 2026 12:28 PM

Bigg Boss Thanuja Puttaswamy Angry about Trolls

బిగ్‌బాస్‌ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్‌ వార్స్‌ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన అయిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్‌పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్‌ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్‌బాస్‌ 7 రన్నరప్‌ , నటి తనూజ పుట్టస్వామి.

ఎవరి జీవితాల్లో వారు బిజీ
ఈ మేరకు తనూజ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం.

పీఆర్‌ టీమ్‌ లేదు
ప్రతిదానికి పీఆర్‌(డబ్బులు పెట్టి ఒక టీమ్‌ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్‌ టీమ్‌ అంటూ ఏదీ లేదు. నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకర్ని టార్గెట్‌ చేశానని, ఒకర్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 

నరకం అనుభవిస్తున్నా..
అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్‌ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! 

గుండె నిండా బాధ
నన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయి. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్లను? ఎవరితో పంచుకోను? అందుకే.. మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకునేందుకు నిశ్శబ్ధంగా ఉంటున్నాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్‌ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? 

మానసికంగా చిత్రవధ
అసభ్య కామెంట్లు పెట్టే ఫేక్‌ అకౌంట్స్‌ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్‌గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్‌ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మరి ఇకమీదటైనా ఈ ట్రోలింగ్‌ తగ్గుతుందేమో చూడాలి!

తనూజ వర్సెస్‌ కల్యాణ్‌
బిగ్‌బాస్‌ 7 షోలో తనూజ, పవన్‌ కల్యాణ్‌ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని ఎప్పుడూ తగువులాడేవారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్‌ను విమర్శించేవాళ్లు! చివరకు కల్యాణ్‌ ట్రోఫీ గెలవడంతో తనూజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనూజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్‌ చేశారు.

చదవండి: ఈ వారం ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. డోంట్‌ మిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement