వాషింగ్టన్: పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా ఖతార్, యూఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు.
అయితే, సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. రస్ లాఫాన్ దాడి తరువాత తెల్లవారుజామున పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. దీంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. అగ్నిప్రమాదాలపై అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. అనంతరం, ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిప్రమాదాల్లో రెండింటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపింది. ఇంకా కూలింగ్, భద్రత చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది.
ట్రంప్ వార్నింగ్..
ఇరాన్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుతంగా ఉంటే, ఇకపై సౌత్ పార్స్ మీద ఎటువంటి దాడులు జరగవని ఆయన హామీ ఇచ్చారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు.


