కోజికోడ్: కేరళలో ఈరోజు (బుధవారం) తెల్లారుతూనే ఘోరం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కాబోయే డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమో లేదా అదుపు తప్పడమో తెలియదు కానీ, వారు ప్రయాణిస్తున్న ఈ స్కూటర్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
బుధవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల ప్రాంతంలో కొయిలాండి సమీపంలోని కురువంగడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకే ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. కురువంగడ్ వద్దకు రాగానే స్కూటర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని కరుణాగపల్లికి చెందిన నంద కిషోర్ (22), కాయంకుళం వాసి అభియాన్ రెహమాన్ (19), అలనెల్లూరుకు చెందిన అభినవ్ సురేష్ (19)గా పోలీసులు గుర్తించారు. వీరంతా మలబార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఆస్పత్రికి తరలించే లోపే..
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకునే లోపే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను మెడికల్ కాలేజీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు కొయిలాండి పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేస్తోంది.
ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం


