భోరున విలపిస్తున్న మాజీ మిస్‌ ఇండియా : కారణం? | Celina Jaitly Breaks Down Cleaning Sonత Grave In Austria, love Other Kids melt you | Sakshi
Sakshi News home page

భోరున విలపిస్తున్న మాజీ మిస్‌ ఇండియా : కారణం?

May 7 2026 11:03 AM | Updated on May 7 2026 11:50 AM

Celina Jaitly Breaks Down Cleaning Sonత Grave In Austria, love Other Kids melt you

బాలీవుడ్‌ ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly)  ఒకపుడు అందాల ప్రపంచాన్ని ఏలిన తార. ఇపుడు అటు తీరని కడుపుశోకం, ఇటు తల్లిగా బిడ్డల్ని కలిసే పరిస్థితి లేక అల్లాడిపోతోంది.  తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అత్యంత బాధాకరమైన పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేయడం అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది.  

భర్త పీటర్ హాగ్ నుండి విడాకులు తీసుకుంటున్న సమయంలో, తన పిల్లలను కలుసు కోనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తన పిల్లలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా అనుమతి లభించడం లేదని ఆమె ఆరోపించారు. సమాధిలో నిద్రిస్తున్న తన బిడ్డను కలుసుకోవడం తప్ప తనకు మరో గత్యంతరం లేదంటూ వాపోతున్నారు.

కుమారుడి సమాధి వద్ద కన్నీటి పర్యంతం
సెలీనా ఆస్ట్రియాలో ఉన్న తన దివంగత కుమారుడు శంషేర్ సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తూ, దాన్ని శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. విడాకుల విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లిన తనకు, జీవించి ఉన్న తన ముగ్గురుపిల్లలను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేవలం మరణించిన కుమారుడిని మాత్రమే కలుసు కోగలిగానని ఆమె అత్యంత వేదనతో పేర్కొన్నారు. భర్త కెరీర్ కోసం తాను భారతదేశాన్ని, తన తల్లిదండ్రులను, సినిమా వృత్తిని వదులుకుని దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా వంటి దేశాలకు తిరిగానని గుర్తు చేసుకున్నారు. చివరికి తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నానని, వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తన పిల్లలకు తనపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా 'బ్రెయిన్ వాషింగ్' చేస్తున్నారని, మీడియాలో తనపై తప్పుడు కథనాలు వచ్చేలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సామరస్య పూర్వకంగా విడిపోవాలని తాను ప్రయత్నించినప్పటికీ, తన వద్ద ఉన్న మిగిలిన ఆస్తుల కోసం అవతలి పక్షం అహేతుకమైన డిమాండ్లు చేస్తోందని సెలీనా పేర్కొన్నారు.ఒక తల్లిగా తన బాధను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోను షేర్ చేయాల్సి వచ్చిందని ఆమె  పేర్కొన్నారు.

కాగా సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌(Peter Haag)ను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు (ట్విన్స్ విన్స్టన్-విరాజ్ మరియు చిన్న కుమారుడు ఆర్థర్) ఉన్నారు. ఆర్థర్ జంటగా పుట్టిన శంషేర్ అనారోగ్య కారణాలతో మరణించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత 2025 నవంబర్‌లో ముంబై కోర్టులో గృహ హింస కేసును దాఖలు చేస్తూ, తన భర్త పీటర్‌ హాగ్‌పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని  ఆరోపించారు. నెలకు రూ.10 లక్షల భరణంతోపాటు రూ.50 కోట్ల పరిహారాన్ని పీటర్‌ నుంచి ఇప్పించాలన్నారు. ప్రస్తుతం తన పిల్లల కస్టడీ, న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ 2004లో విడుదలైన తెలుగు సినిమా ‘సూర్యం’లో నటుడు మంచు విష్ణు సరసన నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement