బాంబుల మోత.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు | BJP Supporters Injured in Panihati Bomb Blast Following Aides Murder | Sakshi
Sakshi News home page

బాంబుల మోత.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు

May 7 2026 8:04 AM | Updated on May 7 2026 8:42 AM

BJP Supporters Injured in Panihati Bomb Blast Following Aides Murder

పానిహటి: పశ్చిమ బెంగాల్‌లోని పానిహటి ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షల నేపథ్యంలో వరుస దాడులతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. బీజేపీ కీలక నేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రత్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే, కొన్ని గంటల వ్యవధిలోనే పానిహటిలో గురువారం ఉదయం నాటు బాంబుల మోత మోగింది. ఈ బాంబు దాడిలో ముగ్గురు బీజేపీ మద్దతుదారులు తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

సెయింట్ జేవియర్స్ స్కూల్ వద్ద కలకలం
బుధవారం రాత్రి చంద్రనాథ్ రత్ తుపాకీ తూటాలకు బలైన ఘటన మరువక ముందే, గురువారం పానిహటిలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ సమీపంలో ఒక బాంబు భారీ శబ్దంతో పేలింది. స్కూల్ వద్ద ఈ పేలుడు జరగడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో అక్కడే ఉన్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడటం ఉద్రిక్తతను మరింత పెంచింది.

ఆస్పత్రికి క్షతగాత్రులు
బాంబు దాడిలో రక్తమోడుతూ పడి ఉన్న ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, పేలుడు జరిగిన ప్రదేశం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభయ తల్లి నివాసానికి అతి సమీపంలో ఉంది.  ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి పోలీసు బలగాలు
హత్య, ఆ తర్వాత వెంటనే జరిగిన బాంబు పేలుడు ఘటనలతో పానిహటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితి చేజారకుండా అదుపులోకి తెచ్చిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement