‘ఆపరేషన్ సింధూర్’ వీడియో విడుదల | IAF Releases Thrilling Operation Sindoor Video | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్ సింధూర్’ వీడియో విడుదల

May 7 2026 8:50 AM | Updated on May 7 2026 9:04 AM

IAF Releases Thrilling Operation Sindoor Video

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌కు భారత్   ‘ఆపరేషన్ సింధూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చింది. నేటికి (మే 7) సరిగ్గా ఏడాది క్రితం శత్రు స్థావరాలపై నిప్పుల వాన కురిపించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్‌)గురువారం విడుదల చేసింది. ‘భారత్ దేన్నీ మర్చిపోదు, ఎవరినీ క్షమించదు’ అంటూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐఏఎఫ్‌ ఇచ్చింది.

మెరుపు దాడి
గత ఏడాది మే 7న అర్ధరాత్రి దాటాక సరిగ్గా ఒంటిగంటా ఐదు నిమిషాలకు భారత వాయుసేన పాకిస్తాన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఇప్పుడు ఆ ప్రతీకార దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సరిగ్గా అదే సమయానికి (1.05 am) ఐఏఎఫ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వీడియోను షేర్ చేసింది. అధునాతన క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో పాక్ మిలిటరీ రాడార్ వ్యవస్థలను, ఉగ్ర శిబిరాలను మన సైన్యం ఎలా ధ్వంసం చేసిందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచేవారిని వెతికి మరీ శిక్షిస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇందులో ఆకర్షణీయంగా నిలిచాయి.

కకావికలమైన ఉగ్ర స్థావరాలు
ఈ ఆపరేషన్‌లో భాగంగా బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తొయిబా స్థావరాలతో పాటు ముజఫరాబాద్, సియాల్‌కోట్ పరిసరాల్లోని పలు ఉగ్ర కేంద్రాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్ భూభాగంలోని పలు ప్రాంతాల్లో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దశాబ్దాల కాలంలో భారత్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఆపరేషన్ సింధూర్ ఒకటిగా నిలిచిపోయింది.

కాల్పుల విరమణ కోసం పాక్ పాట్లు
భారత దళాల వరుస దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. అణ్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికినప్పటికీ, భారత పటిష్టమైన సైనిక శక్తి ముందు తలవంచక తప్పలేదు. దాడులు మొదలైన రెండు రోజులకే (మే 9న) కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ అర్థించే పరిస్థితి తలెత్తింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న దూకుడుకు, మారుతున్న మన సరికొత్త వ్యూహాత్మక విధానాలకు ‘ఆపరేషన్ సింధూర్’ ఒక నిలువెత్తు నిదర్శనమని భద్రతా నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement