హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే.. | Health Tips: What is Hantavirus And Some Crucial Facts | Sakshi
Sakshi News home page

హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..

May 6 2026 10:30 AM | Updated on May 6 2026 10:37 AM

Health Tips: What is Hantavirus And Some Crucial Facts

అట్లాంటిక్‌ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్‌, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

హంటావైరస్ అంటే..
హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్‌. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్‌ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. 

ఎలా వ్యాపిస్తుందంటే..
వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.

మానువుల ద్వారా సంక్రమణ అనేది..
అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. 
లక్షణాలు..
ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.

తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..
వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.

మరణాల రేటు కూడా ఎక్కువే..
ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.

నిర్దిష్ట నివారణ లేదు
హంటావైరస్‌కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్‌.

Advertisement
 
Advertisement
Advertisement