పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ వేస్తూ.. భారీ ఆధిక్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ట్రెండ్స్ ప్రకారం.. డబుల్ సెంచరీకి చేరువగా ఆధిక్యంలో కొనసాగుతూ అధికార కైవసం దిశగా పయనిస్తోంది. టీంఎసీ 100 లోపే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిందనేదానిపై విశ్లేషణలు నడుస్తున్నాయి.
‘‘బెంగాల్ మళ్లీ గెలుస్తుంది’’.. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు’’ అంటూ ఈ మమతా బెనర్జీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని అక్కడి ఓటర్లు సున్నితంగా తిరస్కరించారు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు. అయితే.. వీటితో పాటు ‘ఎం’(M) అనే ఫ్యాక్టర్ కూడా టీఎంసీ ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
M.. మహిళలు: గత మూడు టర్మ్‌లు టీఎంసీ విజయానికి మహిళలు ప్రధాన కారణం. అయితే ఆర్జీకర్ ఘటన, సందేశ్‌ఖాళి వివాదం మహిళలపై భద్రతపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. బీజేపీ ఈ అంశాలను ఉపయోగించుకుంది. ఆర్టీకర్ బాధితురాలి తల్లిని ఏకంగా ఎన్నికల బరిలో దింపింది. మహిళా సెంటిమెంట్‌ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది.
M.. ముస్లింలు: బెంగాల్‌లో టీఎంసీ సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆధారపడింది. ఆ జనాభాలో 27 శాతం టీఎంసీ మద్దతుగా ఉండేది. అయితే.. ఎన్‌ఆర్‌సీ, యూసీసీ భయాలు.. అలాగే ఓటర్ల జాబితా (SIR) వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది. అంతేకాదు.. ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని.. బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు
M.. (మైగ్రేంట్స్.. వలసదారులు): ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓటు వేశారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓటు ధోరణి ఎన్నికల్లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బెంగాల్ చరిత్రలోనే.. భారీగా పోలింగ్ నమోదు అయ్యింది..
M.. (మటువా కమ్యూనిటీ): రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న ఈ సామాజిక వర్గం.. బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చింది. ఈ ఓటు టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది.
M.. (మెషినరీ.. బీజేపీ యంత్రాంగం): టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించలేకపోయింది. కానీ, బీజేపీ మాత్రం కేంద్రం నుంచి భారీ స్థాయిలో ప్రచార యంత్రాంగం, నాయకులను రప్పించుకుంది. ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో BJPకి బలమైన ప్రోత్సాహం ఇచ్చింది. తద్వారా ఓటర్లపై ప్రభావం చూపించింది.
M.. (మోదీ): ప్రధాని మోదీ వ్యక్తిత్వం, దఫదఫాలుగా చేసిన సుదీర్ఘ ప్రచారం, ప్రసంగాలు కమలం పార్టీకి బాగా కలిసొచ్చాయి.
చివరగా.. M.. (మమతా బెనర్జీ): మమతా బెనర్జీ వ్యక్తిత్వం, “మా మట్టి మనుష్” భావోద్వేగ పిలుపు టీఎంసీకి బలాన్ని ఇచ్చింది. కానీ, ఇది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ప్రతిపక్ష బీజేపీ ఆమెపై అవినీతి, హింసా, శాంతి భధ్రతలు క్షీణించడం.. తదితర అంశాలతో దాడి చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత నాడి పట్టుకుని సరికొత్త పాలనా వాగ్దానాలకు చేసింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అంతేకాదు..
ఈ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్ వంటి పార్టీలతో ఓటు విభజన జరిగింది. ఇది కీలక నియోజకవర్గాల్లో టీఎంసీకి భారీ నష్టం కలిగించింది. వీటికి తోడు.. బెంగాల్‌లో కేంద్రం జోక్యం తగదంటూ గత ఐదేళ్లుగా మమతా బెనర్జీ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సవరణలో దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి దిగారు. అయితే టీఎంసీపై ఇవేవీ ప్రజల్లో సింపథీని రాబట్టలేకపోయాయి.


