పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఒకే పార్టీకి పట్టం కట్టడం, సుదీర్ఘకాలం పాటు వారికే అధికారం కట్టబెట్టడం ఇక్కడి ‘బాంగ్లార్ మానుష్’ (బెంగాల్ ప్రజల) నైజం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, వామపక్షాలు, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇక్కడ ఒక్కొక్కటిగా తమ ప్రాభవాన్ని చాటాయి. అయితే, ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సరికొత్త హై-వోల్టేజ్ పోరుకు తెరలేపాయి. 15 ఏళ్లుగా ఎదురులేని శక్తిగా కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూపంలో అత్యంత క్లిష్టమైన సవాలు ఎదురవుతోంది. ‘బెంగాల్‌లో టీఎంసీకి సూర్యాస్తమయం ఖాయం’ అన్న బీజేపీ అధిష్టానం మాటల వెనుక ఉన్న కథేంటి? అసలు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయ ప్రస్తానం ఎలా మారుతూ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.
కాంగ్రెస్ శకం: పునాదులు, పోరాటాలు
స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు వేసింది. 1947 దేశ విభజన సంక్షోభం తర్వాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విచ్ఛిన్నమైన సమాజాన్ని ఒక్కటి చేయడంతో పాటు ఆధునిక బెంగాల్‌కు ఆకృతినిచ్చారు. సాల్ట్ లేక్ సిటీ నిర్మాణం ఆయన దార్శనికతకు నిదర్శనం. అప్పట్లో కలకత్తా కేవలం రాజధాని మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. వందేమాతరం గీతాలాపన నుంచి స్వరాజ్య నినాదం వరకు కలకత్తా వేదికగానే జరిగాయి. అయితే, అంతర్గత విభేదాలు, బంగ్లా కాంగ్రెస్ ఆవిర్భావం, నెహ్రూ, శాస్త్రి వంటి జాతీయ దిగ్గజాల మరణంతో కాంగ్రెస్ పట్టు నెమ్మదిగా సడలుతూ వచ్చింది. 1967 ఎన్నికలు కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి.
ఎర్రకోట: వామపక్షాల సుదీర్ఘ ఆధిపత్యం
జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ బలపడుతున్న సమయంలోనే బెంగాల్ భిన్నమైన మార్గం ఎంచుకుంది. 1977లో జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) బలమైన సైద్ధాంతిక పునాదితో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ బర్గా’ ద్వారా కౌలుదారుల హక్కులు పరిరక్షించడం, 1978లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వారు బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం (1977-2011) ప్రజాస్వామ్యబద్ధంగా పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టినా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఒక కొత్త రాజకీయ శక్తికి మార్గం సుగమం చేసింది.
మమతా ప్రభంజనం: దశాబ్దాల కంచుకోట బద్దలు
సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సరికొత్త నాయకురాలు మమతా బెనర్జీ. 2011 ఎన్నికల్లో వామపక్షాల దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించుతూ, తన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో 184 స్థానాలు సాధించి సంచలనం సృష్టించారు. బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కనపెట్టిన బెంగాల్ ప్రజలు మమతకు బ్రహ్మరథం పట్టారు. కేంద్రంలో వాజ్‌పేయి హయాంలో అధికారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో బెంగాల్‌లో బీజేపీ పాత్ర నామమాత్రమే. 2016 నాటికి 200లకు పైగా సీట్లతో మమత మరింత బలపడ్డారు. ఆమె సంక్షేమ పథకాలు, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం టీఎంసీని అజేయమైన శక్తిగా మార్చాయి.
బీజేపీ ఉప్పెన: బలమైన ప్రతిపక్షంగా..
2021 అసెంబ్లీ ఎన్నికలతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రచారం నిర్వహించింది. దీదీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, బీజేపీ ఏకంగా 77 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు బెంగాల్‌లో ఉనికి కోసం పోరాడిన బీజేపీ, అధికార టీఎంసీకి ఏకైక ప్రత్యమ్నాయంగా ఎదగడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా అతిపెద్ద మలుపు. ఈ పరిణామం దీదీకి భవిష్యత్ సవాళ్లపై స్పష్టమైన సంకేతం ఇచ్చింది.
2026 కురుక్షేత్రం: అధికార మార్పిడి తథ్యమా?
ప్రస్తుత 2026 ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ముఖాముఖీ సమరంగా మారాయి. మునుపెన్నడూ లేనివిధంగా భారీ పోలింగ్ నమోదు కావడం ఉత్కంఠ రేపుతోంది. భవానీపూర్ లాంటి టీఎంసీ కంచుకోటల్లో సైతం బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, ఏ సీటునూ వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి మొగ్గు చూపుతుండటం దీదీకి కలవరపెట్టే అంశమే. 2021లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమత, ఈసారి మరింత కఠినమైన పోరును ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఒకే పార్టీని సుదీర్ఘకాలం ఆదరించిన బెంగాల్ ప్రజలు.. ఈసారి మార్పు కోరుకుంటూ కొత్త చరిత్ర లిఖిస్తారా లేక దీదీకే మళ్లీ జై కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం


