అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర | Germany Go Past India, England. Slam 3rd Highest Total In T20Is | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర

May 1 2026 8:03 PM | Updated on May 1 2026 9:01 PM

Germany Go Past India, England. Slam 3rd Highest Total In T20Is

అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. పసికూన జర్మనీ.. ఇంగ్లండ్‌, భారత్‌ను సైతం వెనక్కు నెట్టి మూడో అత్యధిక టీమ్‌ స్కోర్‌ను నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రియాతో ఇవాళ (మే 1) జరిగిన తొలి టీ20లో జర్మనీ రికార్డు స్థాయిలో వికెట్‌ నష్టానికి 308 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది.

అంతర్జాతీయ టీ20ల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన టీమిండియా కూడా ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న జర్మనీ ఈ ఘనత సాధించడం చరిత్రాత్మకం.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్లలో ఇంగ్లండ్‌ ఒక్కటే ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకింది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జర్మనీ ఈ రికార్డును సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

భారత్‌కు పలు మార్లు 300 పరుగుల మార్కును తాకే అవకాశం వచ్చినా, ఒక్కసారి కూడా తాకలేదు. 2024లో బంగ్లాదేశ్‌పై చేసిన 297 పరుగులే టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ విభాగంలో అత్యధిక స్కోర్‌ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 

2024లో ఈ జట్టు గాంబియాపై ఏకంగా 344 పరుగులు చేసింది. జింబాబ్వే తర్వాత అత్యధిక స్కోర్‌ చేసిన రికార్డు నేపాల్‌ పేరిట ఉంది. నేపాల్‌ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు
* జింబాబ్వే – 344
* నేపాల్‌ – 314
* జర్మనీ – 308
* ఇంగ్లండ్ – 304
* భారత్ – 297

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జర్మనీ.. ఓపెనర్లు బెన్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (58 బంతుల్లో 133 నాటౌట్‌; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), ముసద్దిక్‌ అహ్మద్‌ (48 బంతుల్లో 122; 11 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 308 పరుగులు చేసింది. ముసద్దిక్‌ ఔటయ్యాక వచ్చిన షాహిద్‌ అఫ్రిది (34 నాటౌట్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా 15.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై, 162 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ జట్టు తరఫున ఓపెనర్‌ కరణ్‌బీర్‌ సింగ్‌ (84) ఒక్కడే రాణించాడు.  

యూరప్‌లో కొత్త శక్తి
అంతర్జాతీయ టీ20ల్లో 300 పరుగుల మార్క్ తాకిన తొలి జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇది కేవలం జర్మనీ క్రికెట్‌కే కాదు, యావత్‌ యూరోపియన్ క్రికెట్ అభివృద్ధికి గొప్ప సంకేతం.

బెన్ ఎవరు..?
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బెన్ కొహ్లెర్ కాడ్‌మోర్, ఇంగ్లండ్ క్రికెటర్ టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌కు సోదరుడు. తల్లి జర్మనీ దేశస్థురాలు కావడం చేత బెన్‌ ఆ దేశం తరఫున ఆడే అర్హత సాధించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement