వస్తున్నాయ్‌ ఫీలింగ్స్‌! | Latest Trend: Reunions, Get Togethers Builds Affairs Between Old Friends | Sakshi
Sakshi News home page

వస్తున్నాయ్‌ ఫీలింగ్స్‌!

May 2 2026 8:45 AM | Updated on May 2 2026 10:33 AM

Latest Trend: Reunions, Get Togethers Builds Affairs Between Old Friends

ఈ మధ్యే మా స్కూల్‌ రీయూనియన్‌ జరిగింది. నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నాం. ఆ తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌.. కాల్స్‌.. వీడియో కాల్స్‌. నెమ్మదిగా మా మధ్య వ్యక్తిగత విషయాలను పంచుకునేదాకా వెళ్లింది. ఇప్పుడు అతని గురించే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అతనికింకా పెళ్లి కాలేదు. నా భర్త చాలా మంచోడు. అయినా కూడా ఆయన్ని, పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోవాలని అనిపిస్తోంది?. అందుకు అతను కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీని నుంచి నేను ఎలా బయటపడాలి??.. ఈ తరహా కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి.  

స్కూల్‌ గెట్‌ టు గెదర్‌లో.. పాత స్నేహితుడితో మళ్లీ సంబంధం మొదలుపెట్టిన ఓ మహిళ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో మిగిలిన జీవితం పంచుకునేందుకు భర్త, కడుపున పుట్టిన బిడ్డలను అడ్డు తొలగించుకోవాలనుకుంది. పెరుగన్నంలో విషం పెట్టి చంపాలని చూసింది. అభం శుభం తెలియని పిల్లలు చనిపోగా.. అదృష్టవశాత్తూ భర్త భార్య స్కెచ్‌ నుంచి బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ సమీపంలోని కిష్టారెడ్డిపేటలో కిందటి ఏడాది మార్చిలో ఈ ఘోరం జరిగింది. రజిత.. తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. 

భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న స్రవంతి.. టెన్త్‌ క్లాస్‌ గెట్‌ టు గెదర్‌లో పాల్గొంది. అక్కడ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి నెంబర్‌ తీసుకుని ఓ కానిస్టేబుల్‌ ఆమెతో చాటింగ్‌ చేశాడు. మొదట్లో ఆమె పట్టించుకోలేదు. తనకూ విడాకులయ్యాయని.. మీరు నచ్చారని.. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నమ్మించాడు. ఆపై ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని గర్భవతిని చేశాడు. తీరా తాను తాను మోసపోయానని గుర్తించిన ఆమె న్యాయం కోసం రోడ్డెక్కింది. సూర్యాపేటలో కిందటి ఏడాది నవంబర్‌లో జరిగింది ఈ ఘటన.. 

తాజాగా.. సీతారాం అనే వ్యక్తి తన భార్య రేణుకా వివాహేతర సంబంధాల్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని సూసైడ్‌ లేఖ బయటకు రావడం సంచలన చర్చకు దారి తీసింది. రెండు లక్షల జీతంతో తన భార్యను బాగా చూసుకుంటున్నప్పటికీ.. ఇతరులతో వివాహేతర సంబంధం నడిపిందని.. ఆమె ప్రైవేట్‌ వీడియోలు నెట్టింట చేరుకున్నాయని.. ఇంకా తాను బతికి ఎందుకని.. లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో భార్య, ఆమెతో అఫైర్లు పెట్టుకున్న వ్యక్తులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె వ్యవహారం నడిపిన వాళ్లలో స్కూల్‌, ఇంటర్‌ ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

రీయూనియన్ల, గెట్‌ టు గెదర్‌ల అసలు ఉద్దేశ్యం పాత స్నేహాలను గుర్తుచేసుకోవడం.. జ్ఞాపకాలను పంచుకోవడం. కానీ ఇప్పుడవి విపరీతాలకు దారితీస్తున్నాయి. పాత పరిచయాలు అనైతిక సంబంధాలకు దారి తీస్తూ.. కుటుంబ బంధాలను చెరిపేస్తున్నాయి. కోరికెలు గుర్రాలై పరిగెడుతూ.. ఆ స్పీడ్‌లో ప్రాణాలు తీయడమో లేదంటే ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నాయి. కొన్నిసార్లు అన్నిరకాలుగా మోసపోయి బాధితులుగా కూడా మిగిలిపోతున్నారు. ఈ పరిణామాలు సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.

సైకాలజిస్టులు చెబుతున్నది ఏమిటంటే.. రీయూనియన్లలో కలుసుకునే పాత స్నేహితులు, అప్పటి యవ్వన జ్ఞాపకాలు, భావోద్వేగాలు మళ్లీ రగిలిస్తాయి. ఆ క్షణిక ఉత్సాహం, కొత్తగా ఏర్పడిన అనుబంధం, కొందరిని వివాహేతర సంబంధాల వైపు నెడుతుంది. కానీ ఆ నిర్ణయాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, జీవిత భాగస్వామి నమ్మకం, సమాజంలో గౌరవం అన్నీ ఒక్కసారిగా కూలిపోతున్నాయి. కాబట్టి.. రీయూనియన్లు జ్ఞాపకాల పండుగగా ఉండాలి. అంతేకానీ అవి కాపురాలను ముక్కలు చేసే వేదికలవ్వకూడదు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, సంబంధాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రీయూనియన్ల, గెట్‌ టు గెదర్‌లో కలిసే స్నేహం, జ్ఞాపకాలు ఆనందాన్ని పంచాలి కానీ జీవితాలను శిధిలం చేయకూడదంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement