దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం | Sunil Bansal, Whose Bengal strategy has stunned Mamata Banerjee and Trinamool Congress | Sakshi
Sakshi News home page

దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం

May 2 2026 12:52 PM | Updated on May 2 2026 1:00 PM

Sunil Bansal, Whose Bengal strategy has stunned Mamata Banerjee and Trinamool Congress

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ అనూహ్య ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్. సంస్థాగత నైపుణ్యాలకు మారుపేరైన బన్సాల్.. భూపేంద్ర యాదవ్, బిప్లబ్ దేబ్ వంటి హేమాహేమీలతో కలిసి తన సైలెంట్ ఆపరేషన్‌తో టీఎంసీ అధినేత్రిని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

క్షేత్రస్థాయిలో ప్రకంపనలు
‘భయం వీడండి, నమ్మకం ఉంచండి’ అనే బలమైన నినాదంతో సునీల్ బన్సాల్ బెంగాల్ రణరంగాన్ని సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభల కంటే చిన్నపాటి స్ట్రీట్ మీటింగ్స్‌పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 12,000 వీధి సభలు నిర్వహించారు. అలాగే, ముఖ్యంగా మహిళలు, ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు లక్షా 65 వేల చిన్న సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ..
ఈ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యూహంలో భాగంగా ప్రారంభంలో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోకుండా, టీఎంసీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వాడుకున్నారు. సుమారు 220 నియోజకవర్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తూ 80కి పైగా ప్రెస్ మీట్లు పెట్టారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ వ్యూహాత్మక దాడితో ఏకంగా 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సిన ఒత్తిడి టీఎంసీపై పడింది. ఆ తర్వాత మొదలైన 10 వేల కిలోమీటర్ల ‘పరివర్తన్ యాత్ర’ బీజేపీకి మరింత ఊపునిచ్చింది.

బ్రిగేడ్ సభతో బూస్ట్.. భావోద్వేగాల అస్త్రం
‘బ్రిగేడ్ మైదానాన్ని గెలిచిన వారే బెంగాల్‌ను గెలుస్తారు’ అన్న వాదనను నిజం చేస్తూ, ప్రధాని మోదీ సభకు 5 లక్షల మందికి పైగా హాజరుకావడం మమత శిబిరంలో గుబులు రేపింది. ‘మా-మాటి-మానుష్’ పేరుతో జరిగిన అకృత్యాలను గుర్తుచేస్తూ, ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ బాధితుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా బెంగాలీల సెంటిమెంట్‌ను బీజేపీ బలంగా తాకింది. యువత, మహిళల కోసం ‘యువ కార్డ్’, ‘మాతృశక్తి కార్డ్’ వంటి పథకాలతో నేరుగా వారిని ఆకర్షించారు. మొత్తంగా 640కి పైగా ర్యాలీలతో సునీల్ బన్సాల్ బృందం బెంగాల్‌ను ముట్టడించి, చరిత్ర సృష్టించే దిశగా బలమైన అడుగులు వేసిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

Advertisement
 
Advertisement
Advertisement