కేరళ సీఎం ఎవరు?.. శశి థరూర్ షాకింగ్ ఆన్సర్ | Kerala CM Suspense Shashi Tharoor Breaks Silence | Sakshi
Sakshi News home page

కేరళ సీఎం ఎవరు?.. శశి థరూర్ షాకింగ్ ఆన్సర్

May 4 2026 11:23 AM | Updated on May 4 2026 11:31 AM

Kerala CM Suspense Shashi Tharoor Breaks Silence

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ‘ఎన్డీటీవీ’తో సంచలన విషయాలు పంచుకున్నారు. కేరళ ఓటర్లు స్పష్టమైన మార్పు కోరుకున్నారని, ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అస్తవ్యస్త పాలనకు వ్యతిరేకంగా  తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌) సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉత్కంఠ రేపుతున్న సీఎం రేసు
తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారన్న ప్రశ్నకు థరూర్ చాలా ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే ఆ విషయంపై నాకు ఎలాంటి క్లూ లేదు. మా పార్టీలో సీఎం ఎంపికకు ఒక పద్ధతి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు పంపే పరిశీలకులు.. ముందుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఆ తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. మా వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉండటం పార్టీకి  శుభపరిణామం’ అని థరూర్‌ అన్నారు.

అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
పాలక పక్షంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని థరూర్ పేర్కొన్నారు. ‘కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా జనాదరణ కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారు. మళ్లీ వారికి ఓటేస్తే పాత తప్పుడు పాలనే కొనసాగుతుందని ప్రజలు గ్రహించారు. ఇది ఓటర్ల పరిపక్వతకు నిదర్శనం. ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

99 సీట్లతో కాంగ్రెస్ చారిత్రక రికార్డ్
కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్  మెజారిటీ దిశగా దూసుకుపోతోందని థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 99 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోందని, చాలా కాలం తర్వాత కేరళలో ఈ స్థాయి భారీ విజయం దక్కడం ఒక ‘అద్భుతమైన ఫలితం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని థరూర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement