పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్ | Ranks 157 in 2026 Press Freedom Index Trails Behind Pakistan | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్

May 3 2026 9:34 AM | Updated on May 3 2026 9:34 AM

Ranks 157 in 2026 Press Freedom Index Trails Behind Pakistan

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించే భారత్‌కు ఇది నిజంగా చేదు వార్తే. దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాజాగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)తన సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మన దేశం ఏకంగా పాకిస్తాన్ కంటే వెనుకబడి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం మునుపెన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని, రిపోర్టింగ్‌కు వాతావరణం దారుణంగా మారిందని ఈ రిపోర్ట్ తెలియజేసింది.

ఆందోళన పెంచుతున్న తాజా ర్యాంకింగ్స్
మొత్తం 180 దేశాలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం 157వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే మన ర్యాంకు ఆరు స్థానాలు దిగజారడం గమనార్హం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొనే దాయాది దేశం పాకిస్తాన్ 153వ స్థానంలో నిలిచి మనకంటే మెరుగైన స్థితిలో ఉంది. ఇక మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (152), భూటాన్ (150), శ్రీలంక (134), నేపాల్ (87) కూడా పత్రికా స్వేచ్ఛలో భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. నార్వే, నెదర్లాండ్స్ ఈ జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.

భారత్ పతనానికి కారణాలివే..
మన దేశంలో జర్నలిస్టులపై జాతీయ భద్రతా చట్టాల ప్రయోగం పెరిగిపోవడం, న్యాయపరమైన ఒత్తిళ్లు తీవ్రమవడం ఈ పతనానికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని పొందడంలో సవాళ్లు, మీడియా సంస్థల యాజమాన్యాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం, ప్రకటనలపై ఆధారపడటం వంటివి సంపాదకీయ స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. వీటికి తోడు భౌతిక దాడులు, ప్రాణహాని వంటి తీవ్రమైన భద్రతాపరమైన ముప్పులను భారతీయ జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న స్వేచ్ఛ
ఇటువంటి పరిస్థితి ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచంలోని 100 దేశాల్లో మీడియా పరిస్థితి దారుణంగా దిగజారింది. సగానికి పైగా దేశాల్లో రిపోర్టింగ్ వాతావరణం అత్యంత ‘క్లిష్టమైన’ లేదా ‘అతి తీవ్రమైన’ కేటగిరీలోకి చేరిందని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(మే 3) సందర్భంగా ఈ రిపోర్ట్ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: జర్మనీకి ట్రంప్ భారీ షాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement