నోబెల్‌ రేసులో 'రియల్‌లైఫ్‌ ప్యాడ్‌మ్యాన్‌' అరుణాచలం | Pad Man Arunachalam Muruganantham Nominated For 2026 Nobel Peace Prize For Sanitary Pad Revolution, Watch Video Inside | Sakshi
Sakshi News home page

నోబెల్‌ రేసులో 'రియల్‌లైఫ్‌ ప్యాడ్‌మ్యాన్‌' అరుణాచలం

May 4 2026 5:38 PM | Updated on May 4 2026 6:14 PM

 Padman Arunachalam Muruganantham nominated 2026 Nobel Peace Prize

'ప్యాడ్‌మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అరుణాచలం స్వయంగా తెలిపారు. అసలు మొదట తాను దీన్ని నమ్మలేకపోయానని అన్నారు. నిజానికి నోబెల్ బహుమతికి, మనమే మన పేరును లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను గానీ పంపడం సాధ్యం కాదన్నారు. అది తప్పనిసరిగా థర్డ్‌ సోర్స్‌ ద్వారానే జరుగుతుందని చెప్పారు. 

పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్‌ బృందాలు నోబెల్ కోసం నా పేరును ప్రతిపాదించారు... 24 గంటల్లోపే అది ఆమోదించబడినట్లు తెలిపారు. అంతేగాదు ప్రతిష్టాత్మకమైన ఈ నోబెల్‌ శాంతి బహుమతికి నామినీగా తాను ఎంపిక అయ్యినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని అరుణాచలం మురుగనంతం పేర్కొన్నారు.

అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. దేశంలోని గ్రామీణ మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్‌లను పరిచయం చేశారు. రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్​‌కిన్లపై మహిళలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడమే గాక దానిపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అందుకే అరుణాచలం 'ప్యాడ్‌మ్యాన్‌'గా పాపులర్ అయ్యారు. 

కాగా, అరుణాచలం మురుగనంతం చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ను 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు ఆయన జీవితం ఆధారంగా  'ప్యాడ్‌మ్యాన్' పేరిట బాలీవుడ్‌ మూవీ కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్​, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్​ బల్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో రిలీజ్‌ అయ్యి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

కాగా, 2026 నోబెల్ శాంతి బహుమతికి 287 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కాగా 2026 నోబెల్‌ శాంతి బహుమతిని ఈ ఏడాది అక్టోబరు 9న ప్రకటించనున్నారు. డిసెంబరు 10న ఓస్లాలో ఈ పీజ్ ప్రైజ్‌ను ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ పీజ్ ప్రైజ్ నామినేషన్ల సమర్పణ గడువు ఈ ఏడాది జనవరి 31నే ముగిసింది.

 

(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)

 

Advertisement
 
Advertisement
Advertisement