స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ! | CMs In Trouble As Election Trends Shake States, Stalin, Pinarayi Trail And Mamata Leads In Tight Contest | Sakshi
Sakshi News home page

స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ!

May 4 2026 1:04 PM | Updated on May 4 2026 1:32 PM

Sitting CMs Stalin Vijayan Trail Mamata Fights Back

న్యూఢిల్లీ: తాజా ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్ధండులైన ముఖ్యమంత్రులు తమ సొంత కోటల్లోనే చతికిలబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళలో సీఎం పినరయి విజయన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీతో ఆధిక్యం దోబూచులాడుతోంది.

కొళత్తూరులో స్టాలిన్‌కు షాక్
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సృష్టించిన సునామీలో డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ 4,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 24,993 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, స్టాలిన్‌కు కేవలం 20,982 ఓట్లు వచ్చాయి. ఇక అన్నాడీఎంకే అభ్యర్థి పి.సంతాన కృష్ణన్ 5,982 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే ఏకంగా 112 స్థానాల్లో దూసుకుపోతుండగా, అన్నాడీఎంకే కూటమి 72, డీఎంకే కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ధర్మదంలో తడబడుతున్న పినరయి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సైతం తొలిసారి చేదు అనుభవం ఎదురవుతోంది. ధర్మదం నియోజకవర్గంలో ఆరో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, అడ్వకేట్ వీపీ అబ్దుల్ రషీద్ చేతిలో 600 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. ఇప్పటివరకు పినరయికి 32,455 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేవలం సీఎం మాత్రమే కాకుండా ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం అధికార ఎల్‌డీఎఫ్ కూటమిని కుంగదీసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి వారికి గట్టి పోటీనిస్తోంది.

భవానీపూర్‌లో దీదీ ఉత్కంఠ పోరు
మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కన్నా వెనుకబడిన ఆమె తరువాత క్రమంగా పుంజుకున్నారు. నాలుగో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి మమత 17,244 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థిపై 8,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. క్షణక్షణానికి మారుతున్న ఈ ట్రెండ్స్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement