టీవీకే ఎఫెక్ట్‌.. అన్నాడీఎంకేలో బిగ్‌ ట్విస్ట్‌! | Political Suspense In Tamil Nadu AIADMK MLAs Support To TVK Vijay | Sakshi
Sakshi News home page

టీవీకే ఎఫెక్ట్‌.. అన్నాడీఎంకేలో బిగ్‌ ట్విస్ట్‌!

May 6 2026 11:20 AM | Updated on May 6 2026 11:30 AM

Political Suspense In Tamil Nadu AIADMK MLAs Support To TVK Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్‌.. విజయ్‌ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్‌ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.

అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు.  అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్‌ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్‌ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్‌ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement