టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం | TVK Vijay Approach Supreme Court Lastest News Updates | Sakshi
Sakshi News home page

టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం

May 7 2026 10:15 AM | Updated on May 7 2026 10:47 AM

TVK Vijay Approach Supreme Court Lastest News Updates

తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్‌ విజయ్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్‌తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్‌ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 

అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్‌భవన్‌కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్‌తో రావాలని టీవీకేకు గవర్నర్‌ అర్లేకర్‌ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్‌ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్‌కు విజయ్‌ సమర్పించారు. 

అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్‌కు గవర్నర్‌ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్‌తో భేటీ కావాలని విజయ్‌ నిర్ణయించారు. 

గతంలో.. 
సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్‌) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్‌కు 28 సీట్లు, కాంగ్రెస్‌కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్‌ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్‌ కాంగ్రెస్‌ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్‌కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. 

అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్‌ నిర్ణయాన​ఇ సమర్థించింది. ఇప్పుడు విజయ్‌ టీవీకే లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినా.. గవర్నర్‌ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. 

కాబట్టి విజయ్‌ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్‌ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్‌ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్‌ భావిస్తున్నారు. 

నేషనల్‌ లెవల్‌లోనూ..
గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్‌పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement