రైల్వే వెండర్ల దోపిడీకి చెక్.. ప్రయాణికులదే బాధ్యత! | IRCTC Rules Stop Train Vendors from Overcharging | Sakshi
Sakshi News home page

రైల్వే వెండర్ల దోపిడీకి చెక్.. ప్రయాణికులదే బాధ్యత!

May 7 2026 1:27 PM | Updated on May 7 2026 1:27 PM

IRCTC Rules Stop Train Vendors from Overcharging

న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో ఆహారం లేదా నీళ్ల బాటిల్ కొన్నప్పుడు, అసలు ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి దోపిడీకి గురైనప్పుడు ఎలా స్పందించాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది ప్రయాణికులు మౌనంగా ఉండిపోతారు. అయితే ఇకపై ఇలాంటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల హక్కులను పరిరక్షించేందుకు భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చాయి. ఈ రూల్స్ తెలుసుకుంటే జేబుకు చిల్లు పడకుండా కాపాడుకోగలుగుతాం.

మెనూ కార్డ్, బిల్లు తప్పనిసరి
ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం, రైళ్లలో విక్రయించే ప్రతి ఆహార పదార్థం, పానీయాలను నిర్ణీత, ఆమోదించబడిన ధరకే అమ్మాలి. ఏ వెండర్ అయినా మెనూలో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి అదనంగా అడిగినా, అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రతి రిజిస్టర్డ్ వెండర్ కచ్చితంగా తమ వెంట ‘మెనూ కార్డ్’ ఉంచుకోవాలి, దానిని ప్రయాణికులకు చూపించాలి.అలాగే ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవాలి. బిల్లు ఇవ్వకపోతే డబ్బులు చెల్లించకండి. భవిష్యత్తులో మీరు ఫిర్యాదు చేయడానికి ఈ బిల్లు ఒక కీలకమైన సాక్ష్యంగా పనికి వస్తుంది.

ఫిర్యాదు చేయడం ఎలా?
వెండర్ మెనూలో ఉన్నదాని కంటే అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే  వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ లేదా ఎస్‌ఎంస్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే కోచ్‌లో ఉండే టీటీటీకి లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు పీఎన్‌ఆర్‌ నంబర్, కోచ్ నంబర్, సీటు నంబర్, సంఘటన జరిగిన సమయాన్ని కచ్చితంగా చెప్పాలి. అప్పుడే రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.

వెండర్‌పై చర్యలు... డబ్బులు రిఫండ్!
ప్రయాణికులు చేసిన ఫిర్యాదు విచారణలో నిజమని తేలితే, సంబంధిత వెండర్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. వారికి భారీ జరిమానా విధించడమే కాకుండా, వారి లైసెన్స్ రద్దు చేసి రైల్వే సేవల నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, ప్రయాణికుల ఫిర్యాదు సరైనదని తేలితే, అదనంగా చెల్లించిన మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ ప్రయాణికులను తిరిగి రిఫండ్  చేస్తుంది. అందుకే ప్రయాణంలో ప్రతి కొనుగోలుకు బిల్లు తీసుకోవాలి. అన్యాయం జరిగితే వెనకడుగు వేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement