ఇటీవల హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి (Euthanasia) అనుమతినిచ్చిన నేపథ్యంలో, హృదయాన్ని కలచివేసే మరో గాథ చర్చనీయాంశంగా మారింది. ముంబైకి చెందిన 35 ఏళ్ల ఆనంద్ దీక్షిత్ గత రెండున్నరేళ్లుగా పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (Persistent Vegetative State) అంటే ప్రాణం ఉండి కూడా స్పందన లేని స్థితిలో ఉన్నాడు. హరీష్ రాణా తల్లిదండ్రులు తమ కుమారుడి బాధను చూడలేక కారుణ్య మరణం కోరగా, ఆనంద్ కుటుంబం మాత్రం తమ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని పోరాడుతోంది.తమ కొడుకు మరో హరీష్ రాణాగా మారకూడదని దీక్షిత్ తల్లి దండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే..
కొత్త బండి కొన్న ఉత్సాహం ఆవిరి
2023 డిసెంబర్ 29న గోరఖ్‌పూర్‌లో కొనుగోలు చేసిన కొత్త స్కూటర్‌పై వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదం వారి జీవితాలను అతలాకుతలం చేసింది. గాయపడ్డ కుమారుడు అప్పటి నుండి కోమాలోనే ఉన్నాడు.ఆహారం కోసం, శ్వాస పూర్తిగా యంత్రాల పైనే. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య తమ కొడుకు గుండె కొట్టుకునేలా చేయడానికి దీక్షిత్ కుటుంబం పడని పాట్లులేవు.
రూ. 4కోట్ల ఖర్చు, ఉన్నగూడూ పోయింది
ఇప్పటివరకు వైద్యం కోసం 4 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. దీని కోసం పొలాలు, ఆస్తులు, సేవింగ్స్ అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఒకవైపు ఆస్పత్రిలో కొడుకు ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్దాక్షిణ్యంగా వీరి ఇంటిని కూల్చివేసింది.. బిల్డర్-బీఎంసీ మధ్య ఉన్న వివాదం కారణంగా వీరు నిలువ నీడలేని పరిస్థితిలోకి జారి పోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతూ ఆనంద్‌ను కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారు. అటు 'కేర్ హెల్త్ ఇన్సూరెన్స్' సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో కుటుంబం మరో 50 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకు పోయింది.
హరీష్ రాణా లాగా తమ కొడుకును వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమనీ, కానీ పరిస్థితులు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటూ ఆ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఆనంద్ తల్లి, కొడుకు గడియారాలు, మొబైల్ ఫోన్‌ను భద్రంగా దాచుకొంది. ఏదైనా అద్భుతం జరుగకపోతుందా, తమ బిడ్డ తమను మళ్లీ "అమ్మా", "నాన్నా" అని పిలవకపోతాడా అని తల్లిదండ్రులు ఆశతో కళ్లు కాయలు కాచేలా నిరీక్షస్తున్నారు. ప్రభుత్వం గానీ, దాతలు గానీ సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం.


