‘మలయాళ’ రాజకీయం మారుతోందా? | Special Story On Kerala Political Situation Ahead Of Assembly Elections 2026, Power Struggle Intensifies Among Major Parties | Sakshi
Sakshi News home page

‘మలయాళ’ రాజకీయం మారుతోందా?

Mar 18 2026 9:23 AM | Updated on Mar 18 2026 9:36 AM

Special Story On Kerala Political Situation In Elections

కేరళలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్‌తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..

విజయన్ 3.0 సాధ్యమేనా?
ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్‌ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. 
ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో సీనియర్‌ లీడర్‌గా, సీఎంగా విజయన్‌కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్‌డీఎఫ్ భావిస్తోంది.

మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్‌ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.

హస్త‘గతం’ అవుతుందా?
కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్‌డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్‌కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.

అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.

కాషాయ జెండా ఎగిరేనా?
కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్‌లో ఫుల్‌ జోష్‌ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.

త్రిముఖ పోరు.. 
కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది.  ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్‌డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్‌సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.

మ్యాజిక్‌ ఫిగర్‌.. 
కేరళలో  140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement