Kerala assembly elections
-
రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత?
తిరువనంతపురం: కేరళ రాజకీయ ముఖచిత్రం రేపు తేలిపోనుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య జరిగిన ఉత్కంఠభరిత అసెంబ్లీ ఎన్నికల సమరానికి మే 4న తెరపడనుంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో కేరళ ప్రజలతో పాటు యావత్ దేశం ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపుసోమవారం ఉదయం 8 గంటలకు 43 ప్రాంతాల్లోని 140 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు సహా సుమారు 15 వేల మంది సిబ్బందిని ఈ విధుల్లో నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే దానిపై స్పష్టమైన ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.భారీ పోలింగ్.. బరిలో 883 మందిఈ దఫా కేరళ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 883 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రాష్ట్ర చరిత్రలోనే ఇదొక హోరాహోరీ పోరుగా మారింది. పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదు కావడంతో ఓటర్ల నాడిని పసిగట్టడం రాజకీయ విశ్లేషకులకు సైతం సవాలుగా మారింది.అగ్నిపరీక్షలో పార్టీలు.. ఈ ఫలితాలు మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. 2016 నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అధికార ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యంత హోరాహోరీ పోరు తప్పదని, యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం రావచ్చని అంచనా వేస్తున్నాయి.ఇది కూడా చదవండి: కాసేపట్లో నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ -
Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్?
మే 4న కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో రెండు కీలక ప్రశ్నలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యూడీఎఫ్ (యూడీఎప్) కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ముస్లిం లీగ్ పార్టీ మళ్లీ ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పదవిని దక్కించుకుంటుందా? ప్రస్తుతం ముస్లిం లీగ్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.ముస్లిం లీగ్ వ్యూహాత్మక మౌనంఎన్నికలకు ముందే ముస్లిం లీగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే చర్చ మీడియా, రాజకీయ పరిశీలకుల మధ్య తీవ్రంగా జరిగింది. అయితే బహిరంగంగా ఈ డిమాండ్ చేయకుండా పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. తాము అధికారికంగా ఎలాంటి డిమాండ్ చేయలేదని పార్టీ సీనియర్ నేత పీకే కున్హాలికుట్టి స్పష్టం చేశారు.‘అడగరు కానీ.. ఇస్తే కాదనరు’ప్రస్తుతం ముస్లిం లీగ్ నాయకత్వం అవలంబిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారు బహిరంగంగా డిప్యూటీ సీఎం కుర్చీని డిమాండ్ చేస్తూ మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టకపోయినా, ఒకవేళ ఆ పదవిని ఆఫర్ చేస్తే మాత్రం సంతోషంగా స్వీకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూటమిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని లీగ్ భావిస్తోంది.కున్హాలికుట్టికి దక్కేనా ఆ అరుదైన గౌరవం?యూడీఎఫ్ కూటమికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే కున్హాలికుట్టికి, ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని కొందరు సీనియర్ నేతలు వాదిస్తున్నారు. అయినప్పటికీ, గతంలో తలెత్తిన ‘ఐదవ మంత్రి’ వివాదం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.కేరళ రాజకీయ చరిత్రలో డిప్యూటీ సీఎంల ప్రస్థానంకేరళ రాష్ట్ర రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, ఇప్పటివరకు కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. విశేషమేమిటంటే అందులో ఇద్దరు ముస్లిం లీగ్‌కు చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో చివరిసారిగా ఒక నాయకుడు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి దాదాపు 39 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఆ పాత చరిత్ర మళ్లీ ప్రాణం పోసుకోనుందా అనే చర్చ జరుగుతోంది.తొలి ఉప ముఖ్యమంత్రులురాష్ట్ర మొట్టమొదటి డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత ఆర్ శంకర్ (ఫిబ్రవరి 22, 1960 - సెప్టెంబర్ 26, 1962) పట్టమ్ థాను పిళ్లై మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ (IUML) నేత సీహెచ్ మహమ్మద్ కోయా, కే కరుణాకరన్ రెండవ, మూడవ మంత్రివర్గాల్లో రెండుసార్లు (1981-1982, 1982-1983) ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తన తుదిశ్వాస వరకు డిప్యూటీ సీఎంగానే కొనసాగారు.సుదీర్ఘకాలం పనిచేసిన కే అవకదర్ కుట్టి నహాసీహెచ్ మహమ్మద్ కోయా మరణానంతరం, కే కరుణాకరన్ మూడవ మంత్రివర్గంలో ముస్లిం లీగ్‌కే చెందిన కే అవకదర్ కుట్టి నహా (అక్టోబర్ 24, 1983 - మార్చి 25, 1987) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కేరళ చరిత్రలో అత్యధిక కాలం (మూడేళ్ల 152 రోజులు) ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన పేరిటే ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: బెంగాల్‌కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్! -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్‌తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్‌గా, సీఎంగా విజయన్‌కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్‌కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్‌లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
టీమిండియా మాజీ పేసర్‌కు బీజేపీ టికెట్
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీశాంత్ బరిలో దిగనున్నాడు. శుక్రవారం 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇటీవల శ్రీశాంత్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేరళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. దీంతో కేరళ ఎన్నికల్లో శ్రీశాంత్ ను బరిలో దింపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అతనికి తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించినట్టు ఇటీవల వార్తలు వచ్చినా.. ఉదుమ నుంచి బీజేపీ బరిలో దింపింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.


