లండన్: కాల ప్రయాణం (Time Travel) ఎప్పుడూ ఒక మిస్టరీయే. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన లూయిస్ వాకర్ అనే వ్యక్తి తాను 1977లో రహస్యంగా కాల ప్రయాణం చేసి 4413వ సంవత్సరానికి వెళ్లానని సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
లూయిస్ వాకర్ కథనం ప్రకారం బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న కాలంలో అతనికి ప్రభుత్వ శాస్త్రవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఇంగ్లండ్ ఛానెల్ కింద ఉన్న ఒక రహస్య భూగర్భ కేంద్రంలో టైమ్ మెషీన్‌ను అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు అతనికి తెలిపారు. దీనిని పరీక్షించడానికి కొన్ని పౌండ్ల నగదు ఇస్తామని ఆశ చూపడంతో వాకర్ పరీక్షకు అంగీకరించారు.
త్రిభుజాకారంలో వైర్లతో కూడిన ఆ ప్రత్యేక యంత్రంలో అతన్ని కూర్చోబెట్టగా, కొద్దిసేపటికే అంతా తెల్లగా మారిపోయింది. తేరుకునేసరికి తాను ఖాళీగా ఉన్న ఒక ఆస్పత్రి లాంటి భవనంలో ఉన్నట్లు అతను గుర్తించారు. అక్కడ మానవులు లేరని, పూర్తిగా రోబోట్లే ఆ ప్రపంచాన్ని ఏలుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత అక్కడ మరో కాల ప్రయాణికుడిని కలిశానని, ఆయన ద్వారా 2028 నాటికే ప్రజలకు కాల ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని తెలుసుకున్నట్లు వాకర్ వివరించారు.
అయితే ఈ విచిత్ర ప్రయాణానికి సంబంధించి వాకర్ ఎలాంటి ఆధారాలు లేదా పత్రాలు చూపలేదు. కేవలం తన అనుభవాన్ని మాత్రమే యూట్యూబ్ వేదికగా పంచుకున్నారు. ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేనప్పటికీ, భవిష్యత్తులో రోబోట్ల పాలన ఉంటుందనే ఈ తరహా కథనాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: పిల్లల కథలో అడల్డ్ కంటెంట్.. ‘కేంబ్రిడ్జ్’ హెచ్చరిక!


