కలం చేతనే! | Sakshi Editorial On Author | Sakshi
Sakshi News home page

కలం చేతనే!

Jun 15 2026 12:55 AM | Updated on Jun 15 2026 12:55 AM

Sakshi Editorial On Author

వేల ఏళ్ల కింద గుహగోడ మీద మనిషి బొగ్గుతో గీత గీశాడు. అది అతడి మొదటి కవిత. ఆకలి గురించి కాదు. వేట గురించి కాదు. ఆశ్చర్యం గురించి. ఆకాశం వైపు చూసి మొదటిసారి ‘ఏమిటది?’ అని అడిగిన క్షణమే ఆ గీత. ఆ ప్రశ్నే సాహిత్యమైంది. ఇవాళ అదే మనిషి ఒక తెర ముందు కూర్చున్నాడు. తెర అతన్ని అడుగుతోంది: ‘ఏం కావాలి? కథా... కవితా... వచనమా’... మనిషి కలాన్ని పక్కన పెట్టి, ఆబగా తెరతో బేరసారాలు చేస్తున్నాడు. జోలె పడుతున్నాడు. ఏఐ నా వేయి ఏనుగుల బలం అంటున్నాడు.

ఏఐకి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల జ్ఞాపకాలు దాని వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. దానికి ‘మరపు’ లేదు. కాని మనిషి రచయిత అవుతాడు ఎందుకంటే వాడు మర్చిపోతాడు. బాధను మర్చిపోవడానికి కథ రాస్తాడు. అవమానాన్ని కప్పిపుచ్చడానికి వ్యంగ్యం రాస్తాడు. తీరని ప్రేమను బతికించుకోవడానికి పద్యం రాస్తాడు. మరపు అనే ఖాళీలోనే సృజన పుడుతుంది. యంత్రానికి ఆ ఖాళీ లేదు. దానికి అంతా గుర్తుంటుంది. అందుకే అది కొత్తగా పుట్టించలేదు. ‘వాన వెనుకంజ వేసింది’ అనే వాక్యాన్ని సృష్టించలేదు – ఇంతకు ముందు రాసి ఉంటే తప్ప.

మనిషి రాయడానికి బయల్దేరిన ప్రతి క్షణం భయమే. తెల్ల కాగితం భయం. మొదటి వాక్యం భయం. ‘నేను రాసింది ఎవరైనా చదువుతారా లేదా?’ అనే వణుకు. ఈ భయమే రచయితను నిజాయితీగా ఉంచుతుంది. ప్రతి పదాన్నీ తూకం వేయిస్తుంది. ఏఐకి? అది నిర్భయంగా రాస్తుంది. దానికి పరువు లేదు. పోగొట్టుకోవడానికి పేరూ లేదు. పరువు పోతుందనే భయం లేని చోట సాహిత్యం పుట్టదు. సర్కస్‌ పుడుతుంది. అపసాహిత్యం. అలాగని యంత్రాన్ని ద్వేషించాల్సిన పని లేదు. అది శత్రువు కాదు. ఉలి. శిల్పి చేతిలో ఉలి శిల్పాన్ని చెక్కుతుంది. పిచ్చివాడి చేతిలో పడితే నాశనం చేస్తుంది. రాత్రి రెండు గంటలకు ఒక ఆలోచన తట్టి, పదం దొరకక గోడకు తల బాదుకునే రచయితకు ఏఐ ఒక నిఘంటువు. కథ అడ్డం తిరిగినప్పుడు ‘ఇలా ముగిస్తే ఎలా ఉంటుంది?’ అని సలహా ఇచ్చే మూగ స్నేహితుడు. డెబ్బై ఏళ్ల స్త్రీ తన జ్ఞాపకాలను పుస్తకం చేయాలనుకుంటే ఆమెకు ఏఐ ఒక కార్యదర్శి. ఏ పీరియడ్‌ నవలో రాయాలనుకుంటే మెటీరియల్‌ వెతికి పెట్టే రీసెర్చ్‌ అసిస్టెంట్‌. అంతవరకే. అంతవరకు మాత్రమే. 

తలకిందుల తపస్సు చేసినా ఏఐకి గర్భగుడిలో ప్రవేశం లేదు. ఇవ్వరాదు. కథ పుట్టే చోటు, ఆ మొదటి స్పార్క్, ‘ఎందుకు చెప్పాలి’ అనే తపన – అది మనిషి హృదిలోనే పుట్టాలి. దాన్ని అవుట్‌సోర్స్‌ చేస్తే ఇక అతను రచయిత కాదు, చీప్‌ ఎడిటర్‌ మాత్రమే. యంత్రం రాసిన పేరాలో విషం ఉంటే, అబద్ధం ఉంటే, ఆ పాపం ప్రాంప్ట్‌ కొట్టిన చేతిదే. అన్నీ యంత్రమే ఇస్తే బాగుండనే తరం నేడు తయారైతే రేపటి తరానికి ‘తపన’ అనే పదానికి అర్థం తెలియదు. పదం కోసం వేటాడటం, ఒక ఉపమానం కోసం నెలలు తపించడం, ఒక ఐడియా తట్టినప్పుడు వచ్చే కన్నీరు – ఈ ఆకలిని యంత్రం తీర్చకూడదు. ఇది మనిషికే వదిలేయాలి. 

మనిషి పెన్‌ చూశాడు, టైపు మిషన్‌  చూశాడు, కంప్యూటర్‌ కీబోర్డు చూశాడు, ఇప్పుడు కృత్రిమ మేధను చూస్తున్నాడు. పరికరం మారుతుంది కానీ ఆర్తి మారదు. మారకూడదు. మనిషి గొప్పవాడు ఎందుకంటే వాడు అసంపూర్ణుడు. వాడి రాతలో తప్పులు దొర్లుతాయి. వాక్యం అసంపూర్తిగా ఆగిపోతుంది. అదే మనిషికి అందం. యంత్రం పరిపూర్ణంగా రాస్తుంది. అందుకే చప్పగా ఉంటుంది. సాంకేతిక విప్లవం రావాలి. మన వేళ్లకు సంకెళ్లు వేయకుండా మన కలలకు రెక్కలు ఇవ్వాలి. రేపు ఒక పిల్లవాడు ‘నేను రచయితను అవుతాను’ అన్నప్పుడు, వాడి చేతిలో కలంతో పాటు ఒక తెర కూడా ఉండొచ్చు. తప్పులేదు. కానీ ఆ తెర మీద వాడు చూసేది వాడి ప్రతిబింబమే కావాలి, యంత్రం నీడ కాదు. కలం ఇంకా మన చేతిలోనే ఉంది. దాని మీద వేలిముద్రలు మనవే. రక్తం మనదే. చమట మనదే. ఆ గుర్తులు చెరిగిపోని వరకు మనిషే మహనీయుడు. యంత్రం ఎప్పటికీ అతని నీడ మాత్రమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement