న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, షో హోస్ట్ శేఖర్ సుమన్ తన ‘శేఖర్ టునైట్’ టాక్ షో తాజా ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రంట్ కెమెరా వీడియో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, ‘జెన్-జీ’ భాషపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 63 ఏళ్ల ఈ నటుడు తనదైన శైలిలో రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రధాని మోదీ తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోపై స్పందిస్తూ ‘రావాల్సిన 'అచ్ఛే దిన్ వస్తాయో లేదో కానీ, మంచి రీల్స్ మాత్రం వస్తాయి’ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ ఉదంతాన్ని ప్రధాని ‘ఘోర పాపం’ అని అభివర్ణించడంపై స్పందిస్తూ, ఆ వేదనను వ్యక్తంచేయడానికి మూడు నెలల సమయం పట్టిందని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధం జెన్-జీ ట్రెండ్స్‌లోని ‘సిచ్యుయేషన్‌షిప్’ మాదిరిగా మారిందని, ఎన్నికలప్పుడు లవ్ బాంబింగ్ చేసి, ఆ తర్వాత గోస్టింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు ఎక్స్‌పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల నినాదమైన 'శాంతి, సేవ, న్యాయం' అనే మూడింటి ఎక్స్‌పైరీ తేదీ ఆరోజే ముగిసిందని చురకలంటించారు. సుదీర్ఘ ఆందోళనల తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనకు విద్యాశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం!


