భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పయనంలో దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జులై నెలలో స్థూల జీఎస్టీ రాబడి 15.4 శాతం వృద్ధితో రూ.2.11 లక్షల కోట్లకు చేరింది. గత 14 నెలల కాలంలోనే ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం.
దిగుమతుల జోరు, నికర ఆదాయంలో ఊపు
అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు పుంజుకోవడంతో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వసూళ్లు ఏకంగా 28.8% పెరిగి రూ.66,511 కోట్లకు ఎగబాకాయి. ఇక స్వదేశీ లావాదేవీల ద్వారా లభించిన రాబడి 10.1 శాతం పెరిగి రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యాపారులకు ఇచ్చే రీఫండ్లను మినహాయించిన తర్వాత ప్రభుత్వానికి లభించిన నికర జీఎస్టీ రాబడి 15.8% వృద్ధితో రూ.1.81 లక్షల కోట్లకు చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జులై) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ-ఇన్వాయిసింగ్ విధానం పక్కాగా అమలుకావడం, డేటా విశ్లేషణ ద్వారా పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం ఆదాయానికి ప్రధాన చోదకాలుగా నిలిచాయి. వచ్చే పండుగల సీజన్‌తో రాబోయే త్రైమాసికాల్లో వినియోగం మరింత పెరిగి జీఎస్టీ రాబడి కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!


