స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్! | Maharashtra Govt Bans Junk Food Near Schools, Vada Pav Samosas Out From Canteens, Check More Details | Sakshi
Sakshi News home page

స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!

Aug 1 2026 11:39 AM | Updated on Aug 1 2026 12:44 PM

Govt Bans Junk Food Near Schools Vada Pav Samosas Out from Canteens

బడి ఈడు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మహారాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ (కొవ్వులు, షుగర్‌, సాల్ట్‌ అధికంగా ఉండే పదార్థాలు) విక్రయాలు, ఉచిత పంపిణీ, ప్రకటనలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, పాఠశాలల్లో నిర్వహించే క్యాంటీన్లకు ఆహార భద్రతా లైసెన్సులను తప్పనిసరి చేసింది.

వడాపావ్, సమోసాలకు స్వస్తి

చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, ఇతర జీవనశైలి సమస్యలను అరికట్టేందుకు ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వడాపావ్, సమోసాలతో పాటు నూనెలో వేగించిన తినుబండారాలు, చిప్స్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లను పాఠశాలల్లో లేదా వాటి సమీపంలో విక్రయించకూడదు. స్టేట్ బోర్డ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి బోర్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల దాదాపు రెండు కోట్లకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

క్యాంటీన్లకు లైసెన్స్ నిర్బంధం

ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడించిన వివరాల ప్రకారం.. బడులలో క్యాంటీన్లు నడిపే వెండర్లు తప్పనిసరిగా ఎఫ్‌డీఏ నుంచి అధికారిక లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలే స్వయంగా క్యాంటీన్ నడిపినా లైసెన్స్ తీసుకోవడం విధిగా మారింది. చిన్నారుల నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకు అందరికీ పోషకాహారంతో కూడిన సురక్షిత ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

అమలులో అలసత్వం వహిస్తే చర్యలు

ఈ నిబంధనల అమలు బాధ్యతను హెచ్‌ఎంలు, పాఠశాల యాజమాన్యాలకే అప్పగించారు. నిబంధనల ఉల్లంఘనలను పసిగట్టేందుకు ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్లు ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తారని, నిబంధనలు దాటితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. అదే సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, తాలూకా స్థాయిల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామన్నారు.

ఇదీ చదవండి: బ్యాంక్‌ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement