వేడి ఒత్తిడితో చదువు చిత్తు! | Impact of high temperatures on student attendance | Sakshi
Sakshi News home page

వేడి ఒత్తిడితో చదువు చిత్తు!

Jul 17 2026 5:56 AM | Updated on Jul 17 2026 5:56 AM

Impact of high temperatures on student attendance

విద్యార్థుల హాజరుపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం

పిల్లల అభ్యాసంతో పాటు ఆరోగ్యమూ దెబ్బతింటోందన్న సర్వే 

ప్రతి 10 మందిలో ఏడుగురు పాఠశాలలకు దూరం 

రాష్ట్రంలోనూ తరగతులకు హాజరుకాని 65–70% మంది 

స్వచ్ఛంద సంస్థ ‘క్రై’తాజా అధ్యయనంలో వెల్లడి

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఓ తాజా సర్వే చెబుతోంది. గత ఏడాది వేసవి కన్నా ఈ ఏడాది వేసవి ఎక్కువ వేడి ఒత్తిడిని కలిగించిందని స్వచ్ఛంద సంస్థ చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (సీఆర్‌వై (క్రైౖ ) నిర్వహించిన ‘ఫీలింగ్‌ ద హీట్‌’అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,096 మంది 10–17 ఏళ్ల బడి పిల్లలు ఎదుర్కొన్న వేడి ఒత్తిడి బాధలపై ‘క్రై’సర్వే చేసింది. ఎల్‌నినో పరిస్థితులు ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  

ఏపీలో అత్యధికంగా 88 శాతం
దేశంలో గత వేసవిలో వేడి సంబంధిత ఇబ్బందుల కారణంగా దాదాపు పది మందిలో ఏడుగురు పిల్లలు పాఠశాలలకు లేదా పాఠాలకు దూరమయ్యారు. అధిక వేడి తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని 76 శాతం మంది చెప్పారు. డీహైడ్రేషన్, తలనొప్పి, తీవ్రమైన అలసట, కళ్లు తిరగటం, నిద్ర పట్టటంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజువారీ కూలి పనులు లేదా శారీరక శ్రమ చేసే పేద కుటుంబాల్లో బడి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా అధిక వేడి బాధల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 68 శాతం మంది పాఠశాలకు లేదా సాధారణ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 88 శాతం మంది హాజరు కాలేదు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ కాగా పశ్చిమ బెంగాల్‌లో వీరి సంఖ్య దాదాపు 72 శాతంగా ఉంది.

76% మందిలో ఏకాగ్రత తగ్గింది 
తెలంగాణలో 65–70% మంది పాఠశాల విద్యార్థులు ఎండ తీవ్రత భరించలేక స్కూళ్లకు సెలవు పెట్టారు లేదా క్లాసులకు వెళ్లలేదు. విపరీతమైన ఉక్కపోత వల్ల పాఠాలపై 76% మంది విద్యార్థులు ఏకాగ్రతతో దృష్టి పెట్టలేకపోయారు. తగినంత నీరు అందక శారీరకంగా నీరసించటం, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల ఇళ్లలో రాత్రి పూట విద్యుత్‌ కోతలు, ఉక్కపోత వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోయారు. దీనివల్ల మరుసటి రోజు బడిలో వారు చురుగ్గా ఉండలేకపోయారు.  

సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి 
ఉష్ణోగ్రత రికార్డులు వేడి ఎంత పెరుగుతోందో మనకు స్పష్టం చేస్తుండగా, ఆ వేడి స్కూలు పిల్లల జీవితాలను దెబ్బతీస్తోందో వారే మనకు చెబుతున్నారని ‘క్రై’ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా మర్వాహా అన్నారు. వేడి నివారణ కార్యాచరణ ప్రణాళికలు, వాతావరణ మార్పును ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించేటప్పుడు విధాన రూపకర్తలు ఈ అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement