ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం బిట్‌కాయిన్, షేర్లు, చమురు, రిటైర్మెంట్ ఫండ్లపై ఉండగా, అసలు భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ‘నీరు (Water Rights)’ అని ప్రముఖ ఆర్థిక రచయిత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత ‘రాబర్ట్ కియోసాకి’ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో నీటి హక్కుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణను పంచుకున్నారు.
కియోసాకి ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి పెట్టారని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రముఖ ఇన్వెస్టర్ ‘మైఖేల్ బర్రీ’ ఎన్నో సంవత్సరాలుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే అమెరికాలో 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న బిల్ గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదని, ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’ వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని చెప్పారు.
నీరు లేని భూమికి విలువే లేదు
"నీరు లేని భూమి తక్కువ విలువైనది కాదు... పూర్తిగా విలువలేనిది" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మంచినీటిలో సుమారు 70 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండగా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న జనాభా, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
నీటినీ ట్రేడ్ చేస్తున్న వాల్ స్ట్రీట్
కియోసాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సీఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్‌ను ప్రారంభించింది. అంటే చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు.
ధనవంతుల పెట్టుబడుల వ్యూహం ఇదే!
మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని, తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నారని చెప్పారు.
తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కియోసాకి గుర్తుచేశారు. "ఏది లేకుండా ప్రపంచం జీవించలేదదో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయి" అని తన గురువు చెప్పారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది ‘నీరు’ అవుతుందని తన ఫేస్‌బుక్ పోస్టులో కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.


