ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన | Robert Kiyosaki New Advice Forget Bitcoin Gold Read This Book Before Next Financial Crash | Sakshi
Sakshi News home page

ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన

Jul 9 2026 4:34 AM | Updated on Jul 9 2026 4:47 AM

Robert Kiyosaki New Advice Forget Bitcoin Gold Read This Book Before Next Financial Crash

ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్‌కాయిన్‌, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.

ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్'  (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.

'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'

ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్‌లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.

'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'

పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.

కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్‌కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement