అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి.. మంచి జీవితాన్ని గడపాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఈ కారణంగానే ప్రతి ఏటా వేలాదిమంది దేశం విడిచి వెళుతుంటారు. అయితే.. విదేశాల్లో జీవితం అందరికీ ఒకేలా ఉండదు అంటున్నారు వ్యాపారవేత్త 'హర్ష్ గుప్తా'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హర్ష్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాలు ప్రకారం.. తాను పర్మినెంట్ రెసిడెన్సీతో కెనడాలోని టొరొంటోకు వెళ్లారు. కానీ అక్కడ కేవలం 18 నెలలు మాత్రమే ఉండి, తిరిగి భారత్‌కు వచ్చేశారు. తాను తిరిగి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చారో.. చెప్పిన కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
ఉద్యోగం
హర్ష్ గుప్తా చెప్పిన మొదటి కారణం ఉద్యోగాల గురించి. చాలామంది అనుకునేలా కెనడాలో మంచి ఉద్యోగం సులభంగా దొరకదు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందరూ అనుకునేలా జీతాలు పెద్ద స్థాయిలో ఉండవని, కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఎక్కువ జీతాలు ఇస్తాయని పేర్కొన్నారు.
జీవన వ్యయం
జీవన వ్యయం కూడా ఇబ్బందిగా ఉంటుందని హర్ష్ గుప్తా పేర్కొన్నారు. టొరొంటోలో చిన్న అపార్ట్‌మెంట్‌కే నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. తాను నెలకు దాదాపు పది లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ, అందులో సగం వరకు పన్నులకే వెళ్లిపోయేదని అన్నారు. అందుకే ఎక్కువ సంపాదించినా.. చేతిలో మిగిలేది అంతంత మాత్రమే అని వెల్లడించారు.

ఆరోగ్య సేవలు
ఆరోగ్య సేవల విషయంలో కూడా మంచి అనుభవం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను పొందడానికి ఆరు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని, స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థ గురించి బయట వినిపించేంత సౌకర్యం తనకు కనిపించలేదని హర్ష్ గుప్తా చెప్పారు.
కెనడాలోని చలి వాతావరణం కూడా పెద్ద సమస్య అని హర్ష్ పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా చలి ఉండటంతో బయట తిరగడం కష్టమవుతుందని, రోజంతా చలికోట్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారణంగా చాలామందికి ఒంటరితనం, నిరుత్సాహం కూడా కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
హర్ష్ గుప్తా చెప్పిన విషయాలతో అందరూ ఏకీభవించలేదు. కొందరు నిజంగానే కెనడాలో ఇంటి అద్దెలు, పన్నులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పటికీ.. మరికొందరు మాత్రం కెనడాలో ప్రశాంతమైన జీవితం, మంచి భద్రత, పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తాయని చెప్పారు. కుటుంబంతో జీవించడానికి కెనడా చాలా మంచి దేశమని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలు కొందరికి విజయాన్ని అందిస్తే, మరికొందరికి అనేక ఇబ్బందులను కూడా చూపిస్తాయని ఇంకొందరు అన్నారు.
ఇదీ చదవండి: ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు!


