రూ.6.51 లక్షల కోట్లు వచ్చాయ్‌.. | India Tax collections July 13 2026 Direct Tax growth | Sakshi
Sakshi News home page

రూ.6.51 లక్షల కోట్లు వచ్చాయ్‌..

Jul 16 2026 2:01 PM | Updated on Jul 16 2026 2:12 PM

India Tax collections July 13 2026 Direct Tax growth

కార్పొరేట్‌ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జూలై 13 నాటికి దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 16.40 % పెరిగి రూ.6.51 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సమీక్షా కాలంలో, నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 22% వృద్ధితో రూ.2.40 లక్షల కోట్లకు, నికర కార్పొరేట్‌యేతర పన్ను వసూళ్లు 12% పెరిగి రూ.3.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు చెల్లించే పన్నులు కార్పొరేట్‌యేతర విభాగం కిందకు వస్తాయి.

సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) వసూళ్లు 48% పెరిగి రూ.26,429 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో ప్రభుత్వం రూ.1.22 లక్షల కోట్ల పన్ను రీఫండ్‌లను జారీ చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.57 శాతం అధికం. మరోవైపు, రీఫండ్లను మినహాయించక ముందు స్థూల ప్రాతిపదికన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.11 % పెరిగి రూ.7.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు, కార్పొరేట్‌యేతర పన్ను వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.26.97 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్దేశించింది. ఇది 2025–26లో వసూలైన రూ.23.40 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం అధికం.  

‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలు కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలపై పెద్దగా ప్రభావం చూపలేదు, వాటి లాభాలు స్థిరంగా ఉన్నాయి అనేందుకు ఈ గణాంకాలు నిదర్శనం. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఇప్పటికే బడ్జెట్‌ అంచనాలలో 19.5 శాతానికి, కార్పొరేట్‌యేతర పన్ను వసూళ్లు 27.6 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పునాదిపై కొనసాగుతున్నాయి’’ అని డెలాయిట్‌ పాట్నర్‌ రోహింటన్‌ సిద్ధ్వా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement