ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ సీఈఓ సుందర్ పిచాయ్ యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. సమాజం తమపై ఉంచే అంచనాలు, తల్లిదండ్రుల కోరికల కోసం కాకుండా తమను ఏ రంగం అయితే అమితంగా ఆకర్షిస్తుందో ఆ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రతిష్టాత్మక స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో ఆయన పంచుకున్న అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో చర్చకు దారితీశాయి.
తల్లిదండ్రుల కలలు.. సమాజపు అంచనాలు వద్దు!
‘మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారనే దానిపై లేదా మీ స్నేహితులు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టకండి. సమాజం అంచనాలను పక్కనబెట్టండి. రాత్రి వేళల్లో కూడా రూమ్‌మేట్స్‌తో మీరు దేని గురించి అయితే ఉత్సాహంగా మాట్లాడుకుంటారో, మీ అంతరాత్మను ఏది కదిలిస్తుందో ఆ రంగంలోనే ముందుకు సాగండి’ అని పిచాయ్ ఉద్ఘాటించారు.
భారతదేశంలో మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ కోర్సులవైపే మొగ్గు చూపుతున్న తరుణంలో చెన్నైలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గూగుల్ అధినేతగా ఎదిగిన సుందర్ పిచాయ్ నోట ఈ మాటలు రావడం గమనార్హం.
సుందర్ చెప్పే జీవిత సూత్రాలు
ఆశావాదాన్ని ఎంచుకోండి: ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పరిస్థితులు మన నియంత్రణలో లేనప్పుడు వాటికి మనం ఎలా స్పందిస్తున్నామనేదే ముఖ్యం. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి.
కఠిన సవాళ్లను స్వీకరించండి: గూగుల్ ‘క్రోమ్’ బ్రౌజర్‌ను ప్రారంభించిన కొత్తలో అప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ దాన్ని చాలా చిన్న విషయంగా కొట్టిపారేశారు. అయినా వెనకడుగు వేయకుండా కష్టపడటం వల్లే నేడు క్రోమ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రౌజర్‌గా నిలిచింది. సవాళ్లను ఎదుర్కొంటేనే గుర్తింపు లభిస్తుంది.
ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దు: పిచాయ్ తండ్రి ఏడాది జీతాన్ని పొదుపు చేసి తనను ఉన్నత చదువులకై అమెరికా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతీయ తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, అయితే అదే సమయంలో వారి ఆలోచనలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ ప్రసంగంలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


