పోక్సో నిబంధనలు దుర్వినియోగం  | Supreme Court of India is actively addressing the misuse of the POCSO Act | Sakshi
Sakshi News home page

పోక్సో నిబంధనలు దుర్వినియోగం 

Jul 14 2026 4:29 AM | Updated on Jul 14 2026 4:29 AM

Supreme Court of India is actively addressing the misuse of the POCSO Act

ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం

ప్రేమ జంటలు పారిపోకుండా ప్రభుత్వం ఎలా ఆపగలదని ప్రశ్న 

సాక్షి, న్యూఢిల్లీ: వయసు ప్రభావంతో ఇళ్లు వదిలి వెళ్లే మైనర్ల(15–18 ఏళ్లు)ను ప్రభుత్వం ఎలా నిలువరించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇటువంటి ఘటనలను పోక్సో చట్టం పరిధిలోకి ఎలా తీసుకురాగలమంది. టీనేజీ అమ్మాయిలు తమ భాగస్వాములతో కలిసి వెళ్లిపోతుండగా, కేవలం పరువు కోసం తల్లిదండ్రులు క్రిమినల్‌ కేసులు పెడుతున్నారని, దీంతో కోర్టులు వారిని నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. 

ఇలాంటి కేసులు పోక్సో కిందికే వస్తాయా అనేదే అసలు ప్రశ్న అని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలను నెరిపే టీనేజర్ల విషయంలో పోక్సో చట్టంలోని నిబంధనలు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కౌమార దశలోని పిల్లల గోప్యత, హక్కుల రక్షణపై అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా చేపట్టిన కేసును జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం విచారించింది. పిల్లలపై లైంగిక దాడులు, దోపిడీలను నిరోధించడమే పోక్సో చట్టం ఉద్దేశమని తెలిపింది.  

ఈ కేసు ఓ ఉదాహరణ.. 
విచారణ సందర్భంగా అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు. బెంగాల్‌కు చెందిన ఒక బాలిక 25 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయిన కేసుపై కోర్టు నియమించిన కమిటీ నివేదికను ఆమె ప్రస్తావించారు. టీనేజ్‌ అమ్మాయిలు సంబంధాల్లో చిక్కుకోకుండా తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ 2023లో కలకత్తా హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు నేపథ్యంలో ఈ కేసు ప్రారంభమైంది. 

న్యాయవాది మాధవి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ వివాదం పరిష్కారమైందని, ప్రస్తుతం ఆ యువతి తన భర్త, బిడ్డతో సంతోషంగా ఉందని తెలిపారు. పోక్సో నిబంధనల్లోని లోపాలకు ఈ కేసు ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇష్టపూర్వక సంబంధాలలో ఉన్న టీనేజర్లను పోక్సో కింద జైలుకు పంపుతున్నారని ఆమె ఎత్తిచూపారు. అయితే, పోక్సో చట్టం కింద మైనర్లకు కొన్ని పునరావాస చర్యలు పొందే అర్హత ఉందని ఆమె తెలిపారు. ఈ చట్టంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement