PC: X.com
భారత్ నుంచి నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక అమెరికా పౌరుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్(SSB) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సోనౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనిహ్వా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పీటీఐ తమ కథనంలో పేర్కొంది.
కాగా పట్టుబడిన వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ బ్రౌన్ (36) గా గుర్తించారు. తనిఖీ కోసం అధికారులు ఆపినప్పుడు బ్రౌన్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎస్ఎస్‌బీ సిబ్బంది అతడిని వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక ప్రజల మధ్య, బ్రౌన్ కాలికి తాడు కట్టి భద్రతా సిబ్బంది తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే భద్రతా బలగాల విచారణలో సదరు విదేశీయుడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రౌన్ ఎలాంటి పత్రాలు లేకుండానే గతేడాది నవంబర్‌లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాడని, అప్పటి నుంచి గోవాలో నివసిస్తున్నట్లు మహారాజ్‌గంజ్ అడిషనల్ ఎస్పీ సిద్ధార్థ్ తెలిపారు.
"అతడు టూరిస్ట్ వీసాపై థాయిలాండ్ వెళ్లాడని, అక్కడ తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడని విచారణలో చెప్పాడు. ఆ తర్వాత సముద్ర మార్గంలో శ్రీలంకకు చేరుకుని, అక్కడి నుండి 2025 నవంబర్ 2న సముద్ర మార్గం ద్వారానే భారత్‌కు వచ్చాడు. అప్పటి నుండి గోవాలో ఉంటున్నాడు" అని ఆయన పేర్కొన్నారు. కాగా
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నిందితుడు జోర్డాన్ బ్రౌన్ పోలీసులకు రకరకాల సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివానని, 2024 వరకు దాదాపు ఆరేళ్ల పాటు యూఎస్ నేవీ, ఫారిన్ సర్వీసెస్‌లో పనిచేశానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నిఘా సంస్థలు, స్థానిక పోలీసులు ఈ చొరబాటు వెనుక ఉన్న అసలు కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


