అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్) చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, డాలర్లలో జీతం పొందుతూ స్థిరపడొచ్చని భావించే భారతీయ విద్యార్థుల కలలకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలు విసురుతున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న ఐటీ నిపుణులు అక్కడ ఉండలేక.. అక్కడి నుంచి రాలేక.. సతమతమవుతున్నారు. తాజాగా ఒక భారతీయ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.
అవమానకరమైన ఆఫర్
కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక ఎంఎన్‌సీ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌గా పనిచేసిన ఒక భారతీయ నిపుణుడు తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. అజూర్, ఎస్‌క్యూఎల్ వంటి కీలక టెక్నాలజీలపై పని చేసినప్పటికీ కంపెనీ ఇచ్చిన ఫుల్ టైం ఆఫర్ ఆ విద్యార్థిని విస్మయానికి గురిచేసింది.
ప్రస్తుత ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ కంటే గంటకు కేవలం మూడు డాలర్లు (సుమారు రూ.250) మాత్రమే పెంచుతామని కంపెనీ ప్రతిపాదించింది. సదరు కంపెనీ హెచ్1బీ వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి నిరాకరించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ అభ్యర్థికి ‘బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్’ అనే రోల్‌ను ఆఫర్ చేశారు. ఇది భవిష్యత్తులో కెరీర్ వృద్ధిని దెబ్బతీస్తుందని ఆ టెక్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంఎస్ డిగ్రీ ఉన్న వ్యక్తికి గంటకు మూడు డాలర్లు పెంచడం అంటే అది నైపుణ్యాన్ని అవమానించడమే. ఇక్కడ ఉండటం వృధా అనిపిస్తోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఉంది’ అని ఆ నిపుణుడు పేర్కొన్నారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్ చాలా దారుణంగా ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారికే కాల్స్ రావడం లేదు. కాబట్టి చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘జీతం కంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండటానికి ఉపాధి ముఖ్యం. ఉద్యోగాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని ఇంకొందరు చెబుతున్నారు. ‘స్వదేశానికి వెళ్లడం మంచిదే కానీ, అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉందని గుర్తించాలి. ఏదైనా ఆఫర్ చేతిలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం’ అని కొందరు సలహా ఇస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు


