బ్రేకవుట్‌కు చాన్సుందా?  | India-US Trade Deal Impact, Budget Analysis and Deep Dive | Sakshi
Sakshi News home page

బ్రేకవుట్‌కు చాన్సుందా? 

Feb 9 2026 4:17 AM | Updated on Feb 9 2026 4:17 AM

India-US Trade Deal Impact, Budget Analysis and Deep Dive

యూరప్, యూఎస్‌ డీల్స్‌తో జోష్‌ 

మార్కెట్లలో ఎస్‌టీటీ షాక్‌కు చెక్‌ 

ఇక గణాంకాలు, విదేశీ అంశాల ఎఫెక్ట్‌ 

మార్కెట్‌ ట్రెండ్‌పై నిపుణుల విశ్లేషణ

సార్వత్రిక బడ్జెట్‌సహా.. యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌ తదితర అంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నికరంగా బలపడ్డాయి. బడ్జెట్‌లో ఎస్‌టీటీ పెంపుతో ఆదివారం అమ్మకాలు పోటెత్తగా.. యూఎస్‌ డీల్‌ వార్తలతో ఒక్కసారిగా పరుగందుకున్నాయి. వెరసి సాంకేతిక విశ్లేషణల ప్రకారం సమీప భవిష్యత్‌లో బ్రేకవుట్‌కు చాన్సున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ వారాంతాన ప్రస్తుత ఏడాది(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం ఈ వారం అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం ఫలితాల ఆధారంగా ఆయా స్టాక్‌లపై అమ్మకాల, కొనుగోళ్ల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

 నేడు(9న) ఎస్‌బీఐ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడ్‌కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో ఆటో దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, అశోక్‌ లేలాండ్, పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ, టైటన్‌ కంపెనీ, ఐషర్‌ మోటార్స్, బజాజ్‌ ఎలక్ట్రికల్స్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, అరబిందో, బాటా, గ్లాక్సో, ఫైజర్, ఎస్కార్ట్స్, కర్ణాటక బ్యాంక్, మదర్‌సన్‌ తదితరాలున్నాయి. 

ద్రవ్యోల్బణంపై దృష్టి 
2026 జనవరి వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. 2025 డిసెంబర్‌లో సీపీఐ 1.33 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.71 శాతంకాగా.. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఈ బాటలో 13న గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2025 డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 0.32 శాతం నుంచి 0.83 శాతానికి ఎగసింది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ట్రేడ్‌ డీల్‌ జోష్‌ 
యూఎస్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గదర్శకాలు(ఫ్రేమ్‌వర్క్‌) సిద్ధమైనట్లు వారాంతాన ప్రభుత్వం ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించడంతో 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎగుమతి ఆధారిత రంగాలు, కంపెనీలకు జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే యూరోపియన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎగుమతి రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు వెల్లడించారు. అయితే విస్తరిస్తున్న ఏఐ టూల్స్‌ ప్రభావంతో దేశీ ఐటీ రంగంలో అలజడి తలెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత వారం ఐటీ దిగ్గజాల కౌంటర్లు భారీ అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం ప్రాథమికస్థాయి ఐటీ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు తలెత్తాయి. 

యూఎస్‌ ధరలు.. 
జనవరి నెలకు బుధవారం(11న), శుక్రవారం(13న) చైనా విభిన్న ద్రవ్యోల్బణ గణాంకాలు, హౌసింగ్‌ డేటా విడుదల చేయనుంది. ఈ బాటలో 2025 డిసెంబర్‌ నెలకు యూఎస్‌ రిటైల్‌ అమ్మకాలు 10న వెల్లడికానుండగా.. 11న వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 12న జనవరి గృహ విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు 13న విడుదలకానున్నాయి. ఈ అంశాలకు సైతం మార్కెట్లలో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కారణంగా తక్కువ సుంకాలతో అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు, వైన్, లిక్కర్, ప్రాసెస్‌డ్‌ పండ్లు తదితరాలు దిగుమతికానున్నాయి.

ఆటుపోట్లు తప్పవా?
ఇప్పటికే దేశీ స్టాక్‌ మార్కెట్లు కేంద్ర బడ్జెట్, ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై తగినరీతిలో స్పందించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజాగా యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ తొలి దశ ఒప్పందం ఖరారుకావడంతో ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొనసాగుతున్న రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, కరెన్సీ బలహీనతలు, కమోడిటీలలో అమ్మకాలు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వీడి కొనుగోళ్లకు దిగడం సానుకూల అంశమని ప్రస్తావించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని తదుపరి బ్రేకవుట్‌కు వీలున్నదని అంచనా వేశారు. 

సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే.. 
→ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలిగా 25,500–25, 450 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇంతకంటే దిగువన 25,100 వద్ద సపోర్ట్‌కు అవకాశముంది. ఒకవేళ బలపడితే 26,300– 26,400 పాయింట్లకు చేరే వీలుంది. వీటిని  అధిగమిస్తే 26,800ను తాకవచ్చు. 

→ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నీరసిస్తే తొలుత 82,800–82,300 పాయింట్ల వద్ద మద్దతు కనిపించే వీలుంది. తదుపరి 81,200 వద్ద సపోర్ట్‌ లభించవచ్చు. ఏస్థాయిల నుంచైనా జోరందుకుంటే 85,800–86,000 పాయింట్లకు చేరే అవకాశముంది.

గత వారం అప్‌ 
గత వారం(1–6) నికరంగా సెన్సెక్స్‌ 1,311 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 83,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 373 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 25,694 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లలో అమ్మకాలతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.1–0.4 శాతం మధ్య నీరసించాయి. బడ్జెట్‌ రోజును మినహాయించి చూస్తే సెన్సెక్స్‌ 2,857 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు(3.5 శాతం) చొప్పున జంప్‌చేశాయి.  
 
ఎఫ్‌పీఐల యూటర్న్‌  
రూ. 8,100 కోట్ల పెట్టుబడులు 
దేశీ స్టాక్‌ మార్కెట్లలో 2025 కేలండర్‌ ఏడాదిసహా జనవరిలోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో తాజాగా కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. వెరసి ఈ నెల 6వరకూ రూ. 8,129 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. 2026 జనవరిలో రూ. 35,692 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. 2025లో రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

      – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement