‘ఉగ్రవాదంపై రాజీ లేదు.. ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’ | No double standards no compromise PM Modi | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదంపై రాజీ లేదు.. ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’

Feb 8 2026 10:07 AM | Updated on Feb 8 2026 12:27 PM

No double standards no compromise PM Modi

కౌలాలంపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఆయన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో  ‘పుత్రజయ’లో కీలక భేటీ నిర్వహించారు. రక్షణ, భద్రత,  ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ‘ఉగ్రవాదం విషయంలో మా సందేశం చాలా స్పష్టం.. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు, రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని, భద్రతా పరమైన సహకారాన్ని పెంచుకోవాలని  అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా మారుతున్నదని, ఆసియా దేశాల (ASEAN) సహకారంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం భారత్ కట్టుబడి ఉందని  ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

ఇరు దేశాల మధ్య ఉన్న సముద్ర తీర సంబంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్ వెలుపల అత్యధికంగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్న రెండో దేశం మలేషియా అని పేర్కొంటూ, ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. రక్షణ రంగంలో సహకారాన్ని కేవలం కొనుగోళ్లకే పరిమితం చేయకుండా, సమగ్రంగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు.

సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత తదితర కీలక రంగాలలో సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ సాధిస్తున్న వృద్ధిని అభినందించారు. శనివారం కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మలేషియా ప్రభుత్వం  అపూర్వ స్వాగతం పలికింది. విమానాశ్రయంలో ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా మోదీని ఆహ్వానించడం విశేషం. ఆదివారం ఉదయం పెర్దానా పుత్రలో ప్రధానికి ఘనంగా గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య నాగరికత, చారిత్రక,ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత దృఢ పరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement