పాకిస్తాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌ | Pakistan Former PM Imran Khan Sentenced To 17 Years In Toshakhana Case | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌

Feb 8 2026 9:38 AM | Updated on Feb 8 2026 12:19 PM

Pakistan Former PM Imran Khan Sentenced To 17 Years In Toshakhana Case

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పాకిస్తాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు వారికి.. 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో, ఇమ్రాన్‌ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే, వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. అనంతరం, బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో, తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు.

ఈ సందర్బంగా నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇ‍మ్రాన్‌ ఖాన్‌ అధికారం కోల్పోయిన తర్వాత వరుస కేసులతో సతమతమవుతున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమేనని పాక్ చర్చ నడుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement