ఇది వంచనే: కాంగ్రెస్‌ | Congress Slams Modi Over India-US Trade Deal | Sakshi
Sakshi News home page

ఇది వంచనే: కాంగ్రెస్‌

Feb 8 2026 5:22 AM | Updated on Feb 8 2026 11:39 AM

Congress Slams Modi Over India-US Trade Deal

న్యూఢిల్లీ: భారతీయ రైతులు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ప్రజల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా మోదీ సర్కార్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఎదుట సాగిలపడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగ సారథి పవన్‌ ఖేడా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాజాగా కుదిరింది ఎన్‌డీఏ ప్రభుత్వం, ట్రంప్‌ సర్కార్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంగా లేదు. అగ్రరాజ్యం ముందు మోదీ ప్రభుత్వం ఒంగి సలామ్‌ చేసినట్లుగా ఉంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి పెద్ద ఎత్తున అమెరికన్‌ ఉత్పత్తులు భారత్‌ను ముంచెత్తుతాయి. 

ఇవి మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలను నాశనంచేస్తాయి. గత 75 ఏళ్లుగా భారత్‌ అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా తుంగలో తొక్కి వంచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంటే ఇరుపక్షాలు సమస్థాయిలో సమావేశమై కుదుర్చుకునేది. అంతేగానీ నీ తలపై తుపాకీ గురిపెట్టి, బ్లాక్‌మెయిల్‌ చేసి కుదుర్చుకునేది ఒప్పందం అనిపించుకోదు. అది కేవలం సరెండర్‌ అవడం అవుతుంది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్‌ ఏమాత్రం సహించట్లేదు. ఇది నిజంగా దురదృష్టం’’అని ఖేడా వ్యాఖ్యానించారు.  

రైతన్నల వెన్ను విరిచారు 
‘‘అమెరికా నుంచి విపరీతంగా సాగు సంబంధ ఉత్పత్తుల దిగుమతికి మోదీ సర్కార్‌ ఇప్పుడు అనుమతించింది. దీంతో ఇక్కడ రైతుల వెన్ను విరగనుంది. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం అనేది కష్టాలపాలుకానుంది. ఈ ఒప్పందం భారత్‌లో వ్యవసాయాన్ని ఎంతగా నాశనం చేయనుందో త్వరలోనే కళ్లకుకడుతుంది. ఒప్పందం కారణంగా ఎన్ని రకాల ఉత్పత్తులు భారతీయ విపణికి విపరీతంగా పోటెత్తనున్నాయో వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ చెప్పట్లేరు. 

దిగుమతి కాబోయే వస్తూత్పత్తుల జాబితాను ఆయన తెలివిగా దాచేశారు. ఏఏ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయో అవి మాత్రమే ఘంటాపథంగా చెబుతున్నారు’’అని ఖేడా వెల్లడించారు. గోయల్‌నుద్దేశిస్తూ.. ‘‘మన రూపాయి భవితవ్యం, మన ఆర్థికవ్యవస్థ తాజా పరిస్థితి మీకు తెలుసా? ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతుల విలువ ఏటా 40 లేదా 42 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇకపై ఏటా అది 100 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోనుంది. అంతగా విదేశీమారకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చి కడతాం?’’అని నిలదీశారు.  

హగ్‌లు, ఫొటోలు పనిచేయలేదు 
‘‘ఏ దేశాధినేత, ప్రధాని, అగ్రనేతను కలిసినా మోదీ ఆలింగనం చేసుకుంటూ తెగ ఫొటోలు దిగుతారు. ఈ హగ్‌లు చేసుకునే హగ్లోమసీ, ఫొటోలు దిగే ఫొటో–ఆప్స్‌ ఏమాత్రం భారత అనుకూల ఒప్పందాన్ని సాకారంచేయలేదు. పేరుకే ఆయన నరేంద్ర మోదీ. పని మాత్రం సరెండ్‌ కావడం అంటూ ‘నామ్‌ నరేందర్, కామ్‌ సరెండర్‌’అని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘హౌడీ మోదీ నినాదం కంటే నమస్తే ట్రంప్‌ నినాదమే ఆధిపత్యం కనబర్చింది’’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్‌) జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికన్‌ రైతులపై భారత్‌ దిగుమతి సుంకం ఎత్తేసింది. దీంతో వాళ్లు భారత్‌లోకి విపరీతంగా తమ సరుకులను దిగుమతిచేయడం ఖాయం’’అని జైరాం అన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement