బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గెలిస్తే ఏం వస్తుంది?: ఈటల | BJP MP Etela Rajender Interesting Comments On Elections | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గెలిస్తే ఏం వస్తుంది?: ఈటల

Feb 7 2026 4:43 PM | Updated on Feb 7 2026 5:36 PM

BJP MP Etela Rajender Interesting Comments On Elections

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్‌ఎస్‌ నేతలను గెలిపిస్తే ఏం ప్రయోజనమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిల్లో అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతుంది. కరోనా వచ్చినప్పుడు పేదలకు ఉపాధి లేకపోతే 80 కోట్ల మందికి అన్నం పెట్టింది నరేంద్ర మోదీ. కరోనా కాలంలో వాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడింది మోదీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు మంజూరైతే కేసీఆర్ కనీసం లక్షా70 వేల ఇళ్లు కట్టలేకపోయాడు. మోదీని తిట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం ఖతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే అంటున్నారు. వాళ్ల పరిస్థితి కూడా అదే అవుతుంది.

నాకు తక్కువ టైంలో ఎక్కువ ఓట్లతో ఆశీర్వదించింది గజ్వేల్ ప్రజలే. నామినేషన్‌ వేసిన సమయంలో 5000 మంది వస్తారనుకుంటే 25వేల మంది వచ్చారు. ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్‌ అయితే నైతికంగా గెలిచింది గజ్వేల్‌ ప్రజలు. గజ్వేల్‌కు కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నా.. అభివృద్ధి మాత్రం జరగలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోలేని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది?. తనను కోసినా 5 పైసల బిళ్ళ లేదు. నేను రైతు బంధు ఇవ్వను అని రేవంత్  అంటున్నాడు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement