నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు! | KTR Sensational Allegations On Nampally Fire Accident | Sakshi
Sakshi News home page

నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు!

Feb 7 2026 3:32 PM | Updated on Feb 7 2026 3:45 PM

KTR Sensational Allegations On Nampally Fire Accident

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్‌ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాంపల్లి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌లను, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబ్‌ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్‌ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్‌ జోన్‌ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్‌ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement