‘సుప్రీం’లో మమత..‘ఇది వ్యక్తిగత పోరాటం కాదు’ | West Bengal CM Mamata Banerjee Appears In Supreme Court To Argue Her Petition Personally On Special Electoral Roll, Video Inside | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’లో మమత..‘ఇది వ్యక్తిగత పోరాటం కాదు’

Feb 4 2026 10:55 AM | Updated on Feb 4 2026 1:58 PM

Bengal SIR Supreme Court Hearing Mamata Banerjee hearing

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు  హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ధర్మాసనం అనుమతితో ఆమె నేరుగా తన వాదనలను వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు విన్నవించారు. ‘నేను బెంగాల్ ముఖ్యమంత్రిగా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాను. గౌరవనీయ న్యాయమూర్తులపై నాకు అత్యంత గౌరవం ఉంది. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, బెంగాల్ ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం’ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అనేక లేఖలు రాశానని, అయితే ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆమె ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ ప్రక్రియ సాకుతో ప్రజల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని, ముఖ్యంగా వివాహమై అత్తవారింటికి వెళ్లిన మహిళల పేర్లను ‘నేమ్ మిస్ మ్యాచ్’ పేరుతో తొలగించడం దారుణమని ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని, ఈ సవరణలు చేపడుతున్నారని మమతా ఆరోపించారు. ఈ ప్రక్రియ వల్ల ఏర్పడిన పని ఒత్తిడితో ఇప్పటికే పలువురు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ప్రాణాలు కోల్పోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె సుప్రీంకోర్టును వేడుకున్నారు.

ఎల్‌ఎల్‌బీ డిగ్రీ కలిగిన మమతా, ఈ కేసులో తన వాదనలను స్వయంగా వినిపించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ, మధ్యంతర దరఖాస్తును సమర్పించారు. కోర్టు నిబంధనలు, గౌరవ మర్యాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం తానే నేరుగా వాదనలు వినిపిస్తానని ఆమె కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మమతా బెనర్జీ ముందుగా తన బృందం సభ్యులతో మాట్లాడారు. 

 


దీనికి  ముందు మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఘాటు విమర్శలు చేశారు. చిన్నపాటి వ్యత్యాసాల సాకుతో వేలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని ఆమె  ఆరోపించారు. 2022 ఓటర్ల జాబితాలో ఉన్న ఎవరి పేరునూ తొలగించవద్దని, ఆధార్ కార్డ్, పంచాయతీ ధృవీకరణ పత్రాలను సరైన గుర్తింపు కార్డులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు,  మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రక్రియ సాగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆమె ఆరోపించారు.

బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలను ఉపయోగించి, బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. మమతా బెనర్జీ నేరుగా దీనిపై కోర్టులో పోరాటం చేయడాన్ని ఆమె స్వాగతిస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని  అన్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాక నేపథ్యంలో ఢిల్లీలోని సుప్రీం కోర్టు వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భగవాన్ దాస్ రోడ్, పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా ఇటీవల తాను రాసిన ‘SIR: 26 in 26’ అనే కవితా సంపుటి ద్వారా కూడా మమతా బెనర్జీ నిరసనను వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజా కోర్టులోనూ, న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement